కరోనా బాధితులు కోలుకుంటున్నారు | Corona Patients Recovering Well Says Jawahar Reddy | Sakshi
Sakshi News home page

కరోనా బాధితులు కోలుకుంటున్నారు

Published Fri, Mar 20 2020 9:50 AM | Last Updated on Fri, Mar 20 2020 10:34 AM

Corona Patients Recovering Well Says Jawahar Reddy - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ బారిన పడిన ప్రకాశం, నెల్లూరుకు చెందిన వ్యక్తులు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ  స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దన్నారు. శుక్రవారం కరోనా వైరస్ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్‌లో.. ‘విశాఖపట్నంలో ఒక కరోనా వైరస్‌ పాజిటివ్ కేసు నమోదయ్యింది. వార్తల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చాము. అతిక్రమిస్తే 'ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపీసీ సెక్షన్ 188' ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టాం. వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నెంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి. పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.        

లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలి. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలి. కరోనా ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 966 మంది ప్రయాణికుల్ని గుర్తించాం. 677 మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 258 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. 31 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 119 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 104 మందికి నెగిటివ్ వచ్చింది. 12 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలి. బయటికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులతోగానీ, ఇతరులతో గానీ కలవకూడదు. 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశామ’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement