javahar reddy
-
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించినట్లు తెలిసింది. -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయాలు
-
10 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.9 కోట్లు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బర్డ్ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇక నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. త్రిదండి చినజీయర్ స్వామి సూచనల మేరకు 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు వినియోగించాలని చర్చించింది. 2021-22 ఏడాదికి 12 లక్షల డైరీలు, 8 లక్షల క్యాలండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రించాలని, గ్రీన్ ఎనర్జీ వినియోగం కోసం 35 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు నిర్ణయించింది. అథారిటీ చైర్మన్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారి ఈ సమావేశం జరిగింది. తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు. -
‘వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేస్తాం’
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్ నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నాం. హై రిస్క్ ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రయాణికులందరికీ పరీక్షలు చేస్తాం. త్వరలో విమానాలు కూడా వస్తున్నందున వారికి కూడా పరీక్షలు చేస్తాం. 8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేస్తాం. ( వారంలో జిల్లా గ్రీన్‌జోన్ ) 12 వేల వరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నాం. ఆక్సిజన్ లైన్లను కూడా సమకూర్చుతున్నాం. అనంతపురం, గుంటూరు, క్రిష్ణా, కర్నూలు, విశాఖ, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరిలలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నాం. వైద్య పరీక్షల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. రేపటికి వైద్య పరీక్షల సంఖ్య 3 లక్షలు దాటుతుంది’’ అని అన్నారు. -
అందుకే చైనా కిట్లను తీసుకోలేదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతోనే కరోనా పరీక్షలు చేసేందుకు చైనా కిట్లను తీసుకోలేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహార్ రెడ్డి పేర్కొన్నారు. సౌత్‌కొరియా నుంచి మాత్రమే కరోనా టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్నామని, ఐసీఎంఆర్ ఆమోదించాకే వాటిని పరీక్షలకు ఉపయోగించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దేశంలో అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీ. మిలియన్‌కు 1,649 వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏపీలో 88,061 మందికి పరీక్షలు చేశాం. ( అందుకే ఏపీలో ఎక్కువ కరోనా కేసులు ) ఇప్పటికే 9 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండురోజుల్లో మరో మూడు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. ట్రూనాట్ ద్వారా 3500 పరీక్షలు చేస్తున్నాం. వీఆర్డీఎల్ ద్వారా 4వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. కరోనాపై ప్రతిరోజూ సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 90 నుంచి 7,750 పరీక్షలు చేసే సామర్థ్యానికి చేరుకున్నా’’మని అన్నారు. -
ఫ్రంట్ లైన్ సిబ్బందికి కరోనా
సాక్షి, విజయవాడ : వైద్యులు, పారా మెడికల్, రెవిన్యూ, పోలీస్ సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఫ్రంట్ లైనులో ఉన్న వారికి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 6306 శాంపిళ్లు పరిశీలించాము. 62 శాంపిళ్లు పాజిటివ్ వచ్చాయి. మొత్తం 54341 శాంపిళ్లను పరీక్షించాం. ప్రతి మిలియన్‌కు 1018 మందికి పరీక్షలు చేస్తున్నాం. ఆరేడు జిల్లాల్లో స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువగానే పరీక్షలు చేశాం. 46 కేసులు ప్రస్తుతమున్న కరోనా క్లస్టర్సులోనే ఉన్నాయి. 16 కేసులు ఎనిమిది కొత్త క్లస్టర్లలో వచ్చాయి. 7 మండలాల్లో కొత్తగా కేసులు నమోదయ్యాయి. 566 మండలాలు గ్రీన్ కేటగిరిలో ఉన్నాయి. ప్రస్తుతం 100 మంది పేషంట్లు డిశ్చార్జ్ కావడానికి సిద్దంగా ఉన్నారు. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం యుద్ధం చేస్తున్నాం. ర్యాలీలు చేపట్టొద్దని, సమావేశాలు పెట్టొద్దని నిబంధనలున్నాయి. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో మరణాల సంఖ్య ఎక్కువే.. మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా’’మని పేర్కొన్నారు. -
‘సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలివ్వండి’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నిరోధించి బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె. జవహర్‌రెడ్డి కోరారు. విపత్కర పరిస్థితుల్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘CHIEF MINISTER RELIEF FUND, ANDHRA PRADESH’ పేరున చెక్కులివ్వాన్నారు. ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్‌కు విరాళాలు పంపవచ్చన్నారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా apcmrf.ap.gov.inకు పంపవచ్చునని సూచించారు. దాతలు తమ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, ఈమేయిల్ అడ్రస్, విరాళాల ఉద్దేశం, చెక్కులు లేదా ఆన్లైన్ చెల్లింపు వంటి వివరాలను Special Officer to Hon'ble Chief Minister, Ground Floor, 1st Block, A.P. Secretariat, Velagapudi (e-mail: splofficer-cm@ap.gov.in) కు అందజేయాలి. విరాళాలందజేసిన దాతలు సీఎం కార్యాలయం నుంచి లేఖ, రసీదు, వంద శాతం ఆదాయపు పన్ను మినహాయింపు, ధృవపత్రం మొదలైన వాటిని apcmrf.ap.ov.inవెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. విరాళాలు పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు: ఖాతాపేరు : సీఎంఆర్ఎఫ్ SBI Ac/No - 38588079208 Velagapudi Secretariat Branch IFSC Code: SBIN0018884 ఖాతాపేరు : సీఎంఆర్ఎఫ్ Andhra Bank Account No - 110310100029039.. Velagapudi Secretariat Branch, IFSC Code: ANDB0003079 -
కోలుకున్న తొలి కరోనా బాధితుడు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నిరంతర వైద్య పర్యవేక్షణతో 65 ఏళ్ల వ్యక్తి వైరస్ బారినుంచి బయటపడ్డాడు. మదీనా వెళ్లొచ్చిన సదరు వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో ఈ నెల 17న విశాఖలోని టీబీసీడీ ఆసుపత్రిలో చేరాడు. బీపీ, డయాబెటీస్ ఉన్నప్పటికి చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడింది. నిన్న(ఆదివారం), ఈ రోజు(సోమవారం) నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువకుడికి, రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య ఏపీలో 23కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహార్‌రెడ్డి తెలిపారు. సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ రోజు 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 31 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు 649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 526 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని, ఇంకా 100 మంది ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మరో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం మెరుగుపడిందని, చిత్తూరు - 1, తూర్పు గోదావరి - 3, గుంటూరు - 4, కృష్ణా - 4, కర్నూలు - 1, నెల్లూరు - 1, ప్రకాశం - 3, విశాఖ - 6 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కరోనాపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆయన వెల్లడించారు. ఈ రోజు 22 మందికి పరీక్షలు నిర్వహిస్తే అన్ని నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. -
ఏపీలో మూడు పాజిటివ్ కేసులు
-
కరోనా బాధితులు కోలుకుంటున్నారు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ బారిన పడిన ప్రకాశం, నెల్లూరుకు చెందిన వ్యక్తులు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దన్నారు. శుక్రవారం కరోనా వైరస్ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్‌లో.. ‘విశాఖపట్నంలో ఒక కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయ్యింది. వార్తల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చాము. అతిక్రమిస్తే 'ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపీసీ సెక్షన్ 188' ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టాం. వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నెంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి. పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలి. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలి. కరోనా ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 966 మంది ప్రయాణికుల్ని గుర్తించాం. 677 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 258 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. 31 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 119 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 104 మందికి నెగిటివ్ వచ్చింది. 12 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా ప్రభావిత దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలి. బయటికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులతోగానీ, ఇతరులతో గానీ కలవకూడదు. 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశామ’ని తెలిపారు. -
‘వారి కోసం హోమ్ ఐసొలేటెడ్ చర్యలు చేపట్టాం’
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్ ఐసోలేటెడ్ చర్యలు చేపట్టామని తెలిపారు. (చదవండి : కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు) ఇప్పటివరకు 7వేల మంది తెలుగువారు విదేశాల నుంచి ఏపీకి వచ్చారని వెల్లడించారు. ఇటలీ, స్పెయిన్, ఇరాక్, సౌత్ కొరియా, జపాన్ నుంచి వచ్చిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారి వివరాల కోసం గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్, పీహెచ్సీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తరువాతే ఇళ్లకు పంపుతున్నామని చెప్పారు. ఎరికైనా కరోనా లక్షణాలు కనబడితే 104కు కాల్ చేయమని సూచించారు. -
వదంతులు నమ్మొద్దు.. ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్(కొవిడ్-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. మాస్క్‌లు,శానిటైజర్ల కొరత రానివ్వం అని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరం సమీక్షిస్తున్నామని.. ప్రజలు ఆందోళన పడొద్దని ఆయన సూచించారు. (నిలువునా ముంచిన ‘కరోనా’ ) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 840 మంది ప్రయాణికుల్ని గుర్తించామని పేర్కొన్నారు. 560 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని వెల్లడించారు. 30 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. 92 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 75 మందికి నెగిటివ్ వచ్చిందని.. 16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా..లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. (ఆసుపత్రి నుంచి కరోనా అనుమానితుడి పరార్!) విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంటువ్యాధుల చట్టం-1897ను నోటిఫై చేశామని.. దీంతో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులకు మరిన్ని అధికారాలు కల్పించామని తెలిపారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు. (కరోనాపై తప్పుడు ప్రచారం.. ముగ్గురి అరెస్టు) -
నిధులిస్తాం... నీటి ఎద్దడి రానివ్వద్దు
కడప సెవెన్‌రోడ్స్: వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడాన్ని అధికారులు సవాలుగా తీసుకోవాలని, నిధుల గురించి భయం అక్కర్లేదని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం అంశాలపై పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ సభా భవనంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ యేడు సుమారు 50 శాతం వర్షపాత లోటు కారణంగా వాటర్ లెవల్ 10 మీటర్లకు పడిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బోర్‌వెల్స్ పనిచేయకపోతే వెంటనే రిపేర్లు చేయించాలన్నారు. కొత్త బోర్‌వెల్స్ ఏర్పాటును చివరి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 231 ప్రాంతాల్లో నీటి రవాణా జరుగుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో చేపడతామన్నారు. బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటేముందుగానే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి అవకాశం లేని ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల పథకం కింద 20 లీటర్లకు మించి నీరు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో 392 సింగిల్ విలేజ్ స్కీమ్‌లు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం చివరిలో ఫిల్టర్ పాయింట్లు ఏర్పాటు చేయించి దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లను ఒకవేళ పంటలు ఉంటే వాటికి నష్టపరిహారం చెల్లించైనా బోర్‌వెల్స్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రోళ్లమడుగు స్కీంను మార్చి 15వ తేదీ నాటికి పూర్తి చేసి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం నీటి రవాణాకు ఒక్కో ట్రిప్పుకు ఇస్తున్న రూ. 350 తమకు గిట్టుబాటు కావడం లేదని, రూ. 600 ఇవ్వాలంటూ ట్యాంకర్ల యజమానులు కోరుతున్నారని అధికారులు చెప్పారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందిస్తూ కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. వాటర్ ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఇందువల్ల ట్రిప్పులు అధికంగా రాసుకుని ప్రభుత్వ నిధులను కాజేయడానికి వీలుండదని చెప్పారు. చాలాచోట్ల పంప్ మెకానిక్‌ల కొరత తీవ్రంగా ఉందని, ప్రైవేటు పంప్ మెకానిక్‌ల సేవలను వినియోగించుకోవడానికి జనరల్ ఫండ్స్ లేదా టీఎఫ్సీ నిధులను మంజూరు చేయాలని అధికారులు కోరారు. గ్రామ పంచాయతీల్లో తాగునీరుకు సంబంధించి ఏ పనులు చేపట్టాలన్నా సర్పంచ్‌కే పూర్తి అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు వీలుగా ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. టాయిలెట్స్‌కు జియో ట్యాగింగ్ జిల్లాకు 1.3 లక్షల టాయిలెట్స్ మంజూరయ్యాయన్నారు. వంద రోజుల్లో ప్రతి జిల్లాలో లక్ష టాయిలెట్స్ పూర్తి కావాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని పేర్కొన్నారు. టాయిలెట్స్ నిర్మాణాలను ఆధార్, ఫోటోగ్రఫీకి అనుసంధానం చేయడంతోపాటు జియో ట్యాగింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వరయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసులు, డీపీఓ అపూర్వ సుందరి, డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.