కడప సెవెన్‌రోడ్స్: వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడాన్ని అధికారులు సవాలుగా తీసుకోవాలని, నిధుల గురించి భయం అక్కర్లేదని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం అంశాలపై పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ సభా భవనంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ యేడు సుమారు 50 శాతం వర్షపాత లోటు కారణంగా వాటర్ లెవల్ 10 మీటర్లకు పడిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బోర్‌వెల్స్ పనిచేయకపోతే వెంటనే రిపేర్లు చేయించాలన్నారు. కొత్త బోర్‌వెల్స్ ఏర్పాటును చివరి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 231 ప్రాంతాల్లో నీటి రవాణా జరుగుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో చేపడతామన్నారు. బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటేముందుగానే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి అవకాశం లేని ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల పథకం కింద 20 లీటర్లకు మించి నీరు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో 392 సింగిల్ విలేజ్ స్కీమ్‌లు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం చివరిలో ఫిల్టర్ పాయింట్లు ఏర్పాటు చేయించి దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అవసరమైన ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లను ఒకవేళ పంటలు ఉంటే వాటికి నష్టపరిహారం చెల్లించైనా బోర్‌వెల్స్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రోళ్లమడుగు స్కీంను మార్చి 15వ తేదీ నాటికి పూర్తి చేసి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం నీటి రవాణాకు ఒక్కో ట్రిప్పుకు ఇస్తున్న రూ. 350 తమకు గిట్టుబాటు కావడం లేదని, రూ. 600 ఇవ్వాలంటూ ట్యాంకర్ల యజమానులు కోరుతున్నారని అధికారులు చెప్పారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందిస్తూ కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు.
వాటర్ ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఇందువల్ల ట్రిప్పులు అధికంగా రాసుకుని ప్రభుత్వ నిధులను కాజేయడానికి వీలుండదని చెప్పారు. చాలాచోట్ల పంప్ మెకానిక్‌ల కొరత తీవ్రంగా ఉందని, ప్రైవేటు పంప్ మెకానిక్‌ల సేవలను వినియోగించుకోవడానికి జనరల్ ఫండ్స్ లేదా టీఎఫ్‌సీ నిధులను మంజూరు చేయాలని అధికారులు కోరారు. గ్రామ పంచాయతీల్లో తాగునీరుకు సంబంధించి ఏ పనులు చేపట్టాలన్నా సర్పంచ్‌కే పూర్తి అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు వీలుగా ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
టాయిలెట్స్‌కు జియో ట్యాగింగ్
జిల్లాకు 1.3 లక్షల టాయిలెట్స్ మంజూరయ్యాయన్నారు. వంద రోజుల్లో ప్రతి జిల్లాలో లక్ష టాయిలెట్స్ పూర్తి కావాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని పేర్కొన్నారు. టాయిలెట్స్ నిర్మాణాలను ఆధార్, ఫోటోగ్రఫీకి అనుసంధానం చేయడంతోపాటు జియో ట్యాగింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వరయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసులు, డీపీఓ అపూర్వ సుందరి, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిధులిస్తాం... నీటి ఎద్దడి రానివ్వద్దు
Published Sat, Feb 14 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement
Advertisement