సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిలక్షల జనాభాకు సగటున ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్.. అనతికాలంలోనే 3 లక్షల టెస్టుల మైలురాయి దాటింది. ఆదివారం నాటికి ఏపీలో 3,04,326 టెస్టులు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 11,357 టెస్టులు చేశారు. రాష్ట్రంలో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, 225 ట్రూనాట్ మెషిన్లను ఏర్పాటు చేసి రోజుకు సగటున 10 వేల టెస్టులు చేస్తున్నారు. టెస్టుల్లో ఏపీ కంటే ముందు వరుసలో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. రాజస్థాన్ 2.99 లక్షల టెస్టులు చేసింది. చాలా రాష్ట్రాలు ఇప్పటి వరకూ 2 లక్షల టెస్టుల సంఖ్య కూడా దాటలేదు. 5 కోట్లు, అంతకన్నా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షల జనాభాకు సగటున 5,699 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్‌ను జయించినవారు 1,841 మంది
రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,841కు చేరుకుంది. ఆదివారం 37 మంది డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ప్రకటించింది. ఇందులో 8 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 65.82గా నమోదయ్యింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,357 పరీక్షలు నిర్వహించగా 83 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 11 కేసులు కోయంబేడుకు సంబంధించినవి కాగా 17 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కువైట్ నుంచి వచ్చిన వారిలో 12 మందికి, దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురికి, ఖతార్ నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,797కు చేరింది. ఇందులో వలస కార్మికులవి 153 కేసులు. మొత్తం మరణాల సంఖ్య 56గా ఉంది. కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 900గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment