సాక్షి, మహబూబ్‌నగర్: నడిగడ్డలో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్–19 పాజిటివ్ కేసులతో జోగుళాంబ గద్వాల జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా కట్టడికి ఆ జిల్లా అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ప్రాణాంతక మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే పెరుగుతున్న కేసులతో ఈ నెల 15న.. కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించిన తర్వాత కూడా కేసుల పరంపర కొనసాగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కాటుకు ఇప్పటికే ఆ జిల్లాలో ఇద్దరు చనిపోగా... మరో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో శనివారం ఒక్క రోజే ఏడు కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో ప్రజలు ఉలికిపడ్డారు.
ఇందులో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని జమ్మిచెడు చెందిన ఓ వ్యక్తి, ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన మరోవ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. జిల్లాలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. శనివారం కరోనా నిర్ధారణ అయిన ఐదుగురు ఇటీవల కరోనా లక్షణాలతో మరణించిన జిల్లాకేంద్రానికి చెందిన రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. మరోవైపు సదరు నాయకుడి కుమారుడికి ఈ నెల 17న కరోనా పాజిటివ్ రావడం.. శనివారం మరో ఐదుగురికి నిర్ధారణ కావడంతో ఆ కుటుంబంలో కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
అసలు ఆ కుటుంబానికి ఎవరి నుంచి వైరస్ ట్రాన్స్‌మిషన్ అయింది? ఇప్పటి వరకు వారు ఎక్కడెక్కడ వెళ్లారు? ఎవరెవర్ని కలిశారు..? అని తెలుసుకోవడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి.. మృతి చెందిన సదరు నాయకుడు సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సదరు నాయకుడూ చనిపోవడం.. అతని కుటుంబ సభ్యులు ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే రెండు రోజుల నుంచి జిల్లాకేంద్రంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ అధికారులు శనివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
38 కేసులు మర్కజ్ లింక్‌తోనే..
ఉమ్మడి పాలమూరు పరిధిలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వాటిలో 30 కేసులు కేవలం గద్వాల జిల్లాలోనే వచ్చాయి. వీటిలో జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా 20 కేసులు నమోదు కాగా.. అయిజ పట్టణంలో నాలుగు, శాంతినగర్ పట్టణంలో మూడు, రాజోలి మండలంలో రెండు, ఇటిక్యాల మండలం వల్లూరులో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 11, నాగర్‌కర్నూల్‌లో రెండు, నారాయణపేట జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.
వీరిలో 38 మందికి మర్కజ్ లింకుతోనే వైరస్ సోకింది. మరోవైపు ఇప్పటి వరకు మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ సోకగా.. తాజాగా ఆ సన్నిహితులతో కలిసి తిరిగిన వారికీ కొత్తగా కేసులు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది. గద్వాలలో ఇలాంటి తరహాలోనే కేసులు నమోదవుతుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
పల్లెల్లోనూ ముప్పుంది..
ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ జిల్లా, పట్టణ, మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. గద్వాల జిల్లాలో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇటిక్యాల మండలం వల్లూరులో తొలి కేసు నమోదు కావడంతో అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అతనితో పాటు ఇంకెంత మంది కర్నూలుకు వెళ్లారో ఆరా తీస్తున్నారు. అయితే గద్వాల జిల్లాలో దాదాపు అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం కర్నూలులో మృతిచెందిన సదరు వైద్యుడినే సంప్రదించేవారేనని తెలియడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది.
35మంది క్వారంటైన్‌కు తరలింపు
ఢిల్లీ మర్కజ్ లింకుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గద్వాల జిల్లా ప్రజలకు తాజాగా కర్నూలు లింకు తోడైంది. వైద్యసేవల పరంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా గద్వాలకు దగ్గరగా ఉంటుంది. దీంతో నడిగడ్డకు చెందిన చాలా మంది వైద్యం కోసం కర్నూలులోని ఓ ప్రముఖ వైద్యుడి వద్దకే వెళ్తారు. అయితే ఆ వైద్యుడు, అతని భార్య రెండ్రోజుల క్రితం కరోనాతో చనిపోయారు. దీంతో అతని వద్ద చికిత్స చేయించుకున్న వారందరూ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని కర్నూలుతో పాటు గద్వాల జిల్లాల వైద్యాధికారులూ సూచించారు.
ఇదే క్రమంలో ఈ నెల 17న.. సదరు వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్న గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. శనివారం పట్టణంలోని జమ్మిచెడు, ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనాతో మృతి చెందిన కర్నూలు వైద్యుడి దగ్గరికి ఎవరెవరు వెళ్లారు? అనే కోణాల్లో విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే 35 మందిని గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment