సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ పట్టణాల్లో వ్యాప్తి తగ్గి.. పల్లెల్లో విస్తృతంగా పెరుగుతోంది. వారం రోజుల నుంచి మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లో సాధారణ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక గ్రామాలు, తండాల్లోనే రెట్టింపు కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం దేవరకద్ర మండలం గోపన్‌పల్లిలో ఏకంగా 40మందికి పాజిటివ్ వస్తే.. సోమవారం కోయిలకొండ మండలంలోని వెనకలితండాలో 36మంది, మంగళవారం 27మందికి వైరస్ సోకడం స్థానికంగా కలకలం రేపింది. భూత్పూర్ మండలంలోని నెహ్రూనగర్‌లోనూ 20మందికి పాజిటివ్ వచ్చింది. పల్లెల్లో ఈ వైరస్ పెరగడానికి కారణం రోజువారీగా గ్రామం నుంచి పట్టణాలకు రాకపోకలు సాగించడమేనని తెలుస్తోంది.
కరోనాతో ఇద్దరి మృతి
జిల్లాలో మంగళవారం 174మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తాజాగా ర్యాపిడ్ పరీక్షలు 1,389మందికి చేశారు. ఇంతవరకు 2,459 కేసులు యాక్టివ్‌గా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎనిమిది మంది, ప్రైవేట్‌లో ఒకరు, హోం ఐసోలేషన్‌లో 2,450మంది చికిత్స పొందుతున్నారు. అలాగే 1,707మంది హోం ఐసోలేషన్ పూర్తి చేసుకున్నారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,247కు చేరగా, మరణించిన వారి సంఖ్య 69కి చేరింది. ఆర్‌టీసీపీఆర్ పద్ధతి కింద జిల్లాకు సంబంధించి మరో వంద మంది ఫలితాలు రావాల్సి ఉంది.
వెనకలి తండాలో..
కోయిలకొండ మండలం వెనకలితండాలో ఉన్న జనాభా 500లోపే.. అయితే వరుసగా పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 63మందికి కరోనా సోకింది. ఒకే గ్రామంలో ఈ స్థాయిలో అధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ తండాకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చారు. వారు స్థానికంగా వినాయక ఉత్సవ, నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. వారి నుంచి మొదట ఇద్దరికి ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతోంది. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అక్కడ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అడ్డాకుల మండలం కందూరులో ఒకే ఇంట్లో నలుగురు, మరో వ్యక్తికి వైరస్ సోకింది.
Comments
Please login to add a commentAdd a comment