కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్త విధానాలకు ఐసీఎంఆర్ అనుమతివ్వడంతో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. దీని ప్రకారం త్వరలో రాష్ట్రానికి 240 పరికరాలు రానున్నాయి. ఒక్కో పరికరం ద్వారా రోజుకు కనీసం 20 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రాథమిక స్థాయి పరీక్షల్లో వేగం పెరిగి, సత్వర చర్యలకు వీలుంటుంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ప్రారంభించాలి.
ఢిల్లీ సదస్సు నుంచి వచ్చిన వారికి, వారితో కలిసి మెలిగిన (ప్రైమరీ కాంటాక్ట్స్) వారికి దాదాపు పరీక్షలు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 266 కేసులు నమోదైతే, ఇందులో 243 కేసులు ఢిల్లీ సదస్సుకు హాజరైన వారు,వారిని కాంటాక్ట్ అయిన వారివే.
వ్యాధి నిరోధకత ద్వారా కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారి నుంచి నమూనాలు సేకరించి కొత్త వైద్య విధానాలు రూపొందించుకునే విషయమై అడుగులు ముందుకు వేయాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరించి, ఆ మేరకు డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలే కాకుండా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
వేగవంతంగా పరీక్షలు
► వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారి గుర్తింపు. వీరిలో ఎవరెవరికి పరీక్షలు చేయించాలన్న దానిపై వైద్యులు నిర్ధారిస్తున్నారు. త్వరలో వీరందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యం పెంపు.
► స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎవరైనా ఫోన్ చేసి వైద్యం పొందవచ్చు.
► క్వారంటైన్, ఐసోలేషన్ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగు పరచాలి. సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో రూపొందించుకున్న స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం ముందు కెళ్లాలి.
సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రత్యేక ఆసుపత్రులపై మరింత దృష్టి
► కోవిడ్ ఆసుపత్రుల సన్నద్ధతపై మరింత దృష్టి పెట్టాలి. ప్రతి ఆసుపత్రిలోనూ ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, పనితీరు పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. ఐసీయూ బెడ్లు, వాటి సంఖ్యకు తగినట్టుగా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
► వారం రోజుల పాటు సేవలు అందించిన వైద్య సిబ్బందిని తర్వాత 14 రోజుల పాటు ఐసోలేషన్‌కు పంపించేలా రూపొందించుకున్న ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి. ఇందుకు ఎక్కువ మంది వైద్యులు, సిబ్బంది అవసరం. తగిన చర్యలు తీసుకోవాలి.
► కోవిడ్–19 ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు తగినన్ని అందుబాటులో ఉంచాలి.
క్యాంపుల్లో మెరుగైన సదుపాయాలు
► గుజరాత్‌లో ఉన్న తెలుగు వారి బాగోగులు చూసుకోవడానికి ఏపీ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన అధికారుల బృందం. అక్కడ తెలుగు వారందరికీ భోజన, ఇతర సదుపాయాల కల్పన.
► రాష్ట్రంలోని ప్రత్యేక క్యాంపుల్లో సదుపాయాల కల్పన. క్యాంపు అధికారిగా హాస్టల్ వార్డెన్లు. జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియామకం. ఎప్పటికప్పుడు పరిస్థితిపై పర్యవేక్షణ.
► అవసరాలకు అనుగుణంగా క్యాంపుల పెంపు. అన్ని రకాల సదుపాయాల కల్పన.
► 1902కు వచ్చిన కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు. ప్రతి కాల్‌కు స్పందించాల్సిందే.
ఈ సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment