మండపేట మున్సిపల్ కార్యాలయం
మండపేట: ఆస్తి పన్నుల వసూలుపై కూడా కరోనా ప్రభావం చూపింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ రూ.139.65 కోట్లు కాగా మార్చి నెలాఖరు నాటికి 50 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. 78.9 శాతం పన్నుల వసూలుతో పెద్దాపురం పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పన్నుల వసూలుకు ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు.
జిల్లాలోని నగర, పురపాలక సంస్థల్లో 2,55,418 అసెస్మెంట్లకు గాను గతేడాది ఆస్తిపన్ను డిమాండ్ రూ.139.65 కోట్లుగా ఉంది. సాధారణంగా మార్చి చివరి వారంలో అధిక శాతం యజమానులు పన్నులు చెల్లిస్తారు. అదే సమయంలో కలకలం రేపిన కరోనా వైరస్ పన్నుల వసూలుపైనా ప్రభావం చూపింది. మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమలులోకి రాగా పన్నుల వసూలు మందగించాయి. ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా పన్నుల వసూలుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలపై ఒత్తిడి తీసుకురాలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 87.09 శాతం పన్నులు వసూలు కాగా 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 69.82 కోట్లుతో 50 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. అత్యధికంగా పెద్దాపురంలో 78.9 శాతం పన్నులు వసూలు కాగా 77.4 శాతంతో గొల్లప్రోలు నగర పంచాయతీ ద్వితీయ స్థానంలో ఉంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 48.4 శాతం, కాకినాడలో 51.7 శాతం, మండపేట మున్సిపాలిటీలో 56.9 శాతం, అమలాపురంలో 46.1 శాతం, రామచంద్రపురంలో 34.9 శాతం, పిఠాపురంలో 33.4 శాతం, తునిలో 64.3 శాతం, సామర్లకోటలో 53.3 శాతం, ఏలేశ్వరం నగర పంచాయతీలో 58.1 శాతం, ముమ్మిడివరంలో 48 శాతం పన్నులు వసూలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment