సాక్షి, శ్రీకాకుళం: వలస కూలీలపై కరోనా పంజా విసిరింది. సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చామని ఆనందపడ్డ వారికి అంతలోనే కష్టమొచ్చింది. చెన్నై నుంచి వచ్చిన వారి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఒకటితో ప్రారంభం కాగా తాజాగా 19 నమోదై మొత్తం 20కి చేరినట్టు సమాచారం. వీరిలో మత్స్యకారులు, ఇతరత్రా కూలీలు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఎచ్చెర్ల, శ్రీకాకుళం, సరుబుజ్జిలి మండలాల్లోని క్వారంటైన్‌లో ఉండటంతో జిల్లావాసులకు ఎటువంటి ముప్పు లేదు. మొదట విదేశాల నుంచి వచ్చిన వారితో ఆందోళన నెలకొంది. ఆ తర్వాత ఢిల్లీ వారితో వణుకు.. అనంతరం గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితో ముప్పు వస్తుందేమోనని భయం.. మధ్యలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారి గురించి ఆందోళన చెందినా వారి వలన పెద్దగా ముప్పు లేకుండా పోయింది. ప్రస్తు తం చెన్నై వణుకు పుట్టిస్తోంది. అక్కడి నుంచి బస్సుల ద్వారా, శ్రామిక్ రైలు ద్వారా వచ్చిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి.
తాజాగా నమోదైన 19 కేసుల్లో 10మంది మహిళలే..!
కొత్తగా నమోదైన 19 కేసుల్లో 10మంది మహిళలు ఉన్నట్టు తెలిసింది. వీరంతా ప్రత్యేక బస్సులు, శ్రామిక్ రైలు ద్వారా జిల్లాకు చేరుకున్నారు. వచ్చిన వారందరినీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌లో పెట్టడంతో జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం లేకుండా పోయింది. చెన్నైలో ముఖ్యంగా కోయంబేడు మార్కెట్ ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తమై పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో తాజాగా 19 పాజిటివ్ కేసులొచ్చాయి. వీరిలో 17మంది జెమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరికి టీబీ, ఆస్తమా ఉండటంతో విశాఖపట్నం విమ్స్ కోవిడ్ ఆసుపత్రికి పంపించినట్టు సమాచారం.
తల్లికి పాజిటివ్.. బిడ్డ దూరం
తాజాగా నమోదైన వారిలో మూడేళ్ల బిడ్డ గల తల్లికి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే ఆమె బిడ్డకు, భర్తకు కూడా పరీక్షలు చేశారు. వారిద్దరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో పాజిటివ్ వచ్చిన తల్లిని జెమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చేర్చగా, తండ్రి చెంతన బిడ్డను ఉంచి రిమ్స్ క్వారంటైన్‌లో పర్యవేక్షిస్తున్నారు.
ఎలాగైనా సొంతూరు చేరాలి..
రోజురోజుకు నీరసించిపోతూ.. అడుగులు ముందుకు పడని స్థితిలో.. ప్రమాదకరమని తెలిసినా వలస కార్మికులు ఇలా లారీలను ఆశ్రయిస్తున్నారు. –రణస్థలం
Comments
Please login to add a commentAdd a comment