సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్కసారిగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు కలకలం రేపారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయనుకుంటే, ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. మార్చి 30వ తేదీ సోమవారం రాత్రి వరకు 23 పాజిటివ్ కేసులతో ఉన్న రాష్ట్రం.. మంగళవారం నాటికి ఒక్క రోజు వ్యవధిలో ఆ సంఖ్య 44కు చేరింది.
► ఒకేరోజు 21 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం.
► ఈ మర్కజ్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచింది. ఏటా మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మర్కజ్‌కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 14, 15వ తేదీల్లో మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రార్థనల కోసం వెళ్లారు.
► ఈ సమయంలో వివిధ దేశాల నుంచి ఆ దర్గాకు వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్ అప్పటికే సోకినట్లు తెలుస్తోంది. ఆ విషయం అప్పట్లో ఎవరికీ తెలియక పోవడంతో అందరూ సన్నిహితంగా కలిసి మెలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
► దీంతో మన రాష్ట్రానికి చెందిన పలువురు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆ విషయం తెలియకుండానే తిరిగి వారు మార్చి 17న స్వస్థలాలకు చేరుకున్నారు.
► 14 రోజుల అనంతరం ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలియడంతో అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో ఆందోళనతో పాటు అప్రమత్తతా పెరిగింది.
► ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు.
► వారు ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో తిరిగారు.. ఎంత మందిని కలిశారు.. ఎక్కడ బస చేశారు.. రైల్లో ఏ బోగీలో ప్రయాణించారు.. వంటి వివరాల కోసం ఆయా జిల్లాల యంత్రాంగం అణువణువూ గాలిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఎంత మందిని కలిశారో..
– చాలా మంది మార్చి 14, 15వ తేదీల్లో ఢిల్లీకి వెళ్లి 17వ తేదీ నుంచి ఏపీకి వచ్చారు.
– మంగళవారం ఉదయం నుంచీ ఢిల్లీ నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపాలిటీ యంత్రాంగం పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఎక్కువ మంది ఢిల్లీ నుంచి దురంతో, ఏపీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించారు. వీరితో పాటు ఆ రోజు ఆయా బోగీల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
– రైతు బజార్లకు గానీ, ఫిష్ మార్కెట్లకు గానీ ఏమైనా వెళ్లారా.. ఏవైనా ఫంక్షన్‌లకు వెళ్లారా.. అన్న దానిపై ఎక్కువగా ఆరా తీస్తున్నారు. వారి ఇళ్లకు వచ్చి వెళ్లిన వారి నమూనాలనూ సేకరిస్తున్నారు. వారి ఇళ్ల చుట్టూ యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు.
– ఇరుగు పొరుగు వారిని బయటకు రావద్దని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 535 మంది నమూనాలను సేకరించి నిర్ధారణకు పంపించారు.
– మంగళవారం రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో ప్రకాశం జిల్లాకు చెందిన వారు 8 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా 11 కేసులు నమోదైంది ఈ జిల్లాలోనే.
స్వచ్ఛందంగా ముందుకు రండి
ఢిల్లీ నుంచి వచ్చిన వారికి సీఎం విజ్ఞప్తి
వైద్యం తీసుకుంటే ఎవరికీ ఏం కాదు.. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది
ఢిల్లీ వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వైద్యం తీసుకుంటే ఎవరికీ ఏం కాదని, ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని స్పష్టం చేశారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి, వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మంగళవారం నమోదైన కేసుల్లో చాలా మంది ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ సదస్సుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. జమాత్ నిర్వాహకులు, రైల్వే ద్వారా వారి వివరాలు సేకరించామని చెప్పారు. సీఎం స్పందిస్తూ.. వారందరినీ క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలున్న వారు ఎవరైనా సరే ఆరోగ్య వివరాలను అందించాలని, లేదంటే వారి కుటుంబ సభ్యులకూ నష్టం కలుగుతుందని హెచ్చరించారు.
ఒక్కరోజే 21 కరోనా పాజిటివ్
Published Wed, Apr 1 2020 2:37 AM | Last Updated on Wed, Apr 1 2020 7:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment