ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ మహమ్మారి బారినపడి ఇప్పటికే 131 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్ కంపెనీకి ఎంపికైన పలువురు ఇంజనీర్లు.. శిక్షణ నిమిత్తం చైనాకు వెళ్లారు. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో తమ పిల్లలను క్షేమంగా భారత్‌కు తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఇప్పటికే 7 విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని 20 విమానాశ్రయాలకు విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. మనవారిని వెనక్కి రప్పిస్తున్నాం.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు చెప్పారు. అయితే అందుకు మరికొద్ది రోజులు పట్టొచ్చనీ, వారిని వెనక్కి తీసుకొచ్చి తీరుతామనీ, స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment