telugu engineer
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
వదంతులు నమ్మవద్దు: తెలుగు ఇంజనీర్లు
-
వదంతులు నమ్మవద్దు: తెలుగు ఇంజనీర్లు
సాక్షి, చిత్తూరు : ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తున్న వేళ వుహాన్‌లో చిక్కుకున్న 58 మంది తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ పిల్లల ఎలా ఉన్నారో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు క్షేమంగానే ఉన్నట్టు టీసీఎల్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ప్రతినిధి రఘు తెలిపారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. వుహాన్‌లో చైనా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు వారిని అక్కడి నుంచి వెంటనే భారత్‌కు తీసుకురాలేకపోతున్నామని చెప్పారు. బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడామని వీలైనంత త్వరగా వారిని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు తాము క్షేమంగానే ఉన్నామని.. వదంతులు నమ్మవద్దని చైనాలో చిక్కుకున్న ఇంజనీర్లు కోరారు. గురువారం రఘు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీసీఎల్ తరఫున చైనాలో 89 మంది పనిచేస్తున్నారు. వారిలో 58 మంది వుహాన్‌లో, 17 మంది షెన్జెన్లో ఉంటున్నారు. 14 మంది గతేడాది నవంబర్లోనే ఇండియాకు తిరిగివచ్చారు. షెన్జెన్లో ఉంటున్న 17 మంది ప్రస్తుతం ఇండియాకు బయలుదేరారు. తెలుగు ఇంజనీర్లను ఇండియాకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కంపెనీ తరఫున వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. వారిని హౌస్ అరెస్ట్ చేశామనడం అవాస్తవం. బయటకు వస్తే వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో రూమ్‌ల్లో ఉంచి షిఫ్టులవారీగా టెంపరెచర్ చెక్ చేస్తున్నాం. ఇంజనీర్లను తరలించేందుకు ఎంబసీ అధికారులతో మా కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. బీజింగ్‌లోని ఎంబసీ అధికారులు అనికేత్ అనే వ్యక్తిని మాకు అపాయింట్ చేశారు. రేపు వుహాన్‌లో ఉన్న ఇంజనీర్లకు టోకెన్లు కేటాయిస్తారు. ఆ తర్వాత వారి ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ తరఫున వారికి పూర్తి సాకారం అందజేస్తున్నామ’ని తెలిపారు.(చదవండి : భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’) వుహాన్‌లో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు మాట్లాడుతూ..‘తాము చైనాలో క్షేమంగానే ఉన్నాం. మేము పనిచేస్తున్న కంపెనీ బాగానే చూసుకుంటోంది. రోజు వైద్య పరీక్షలు చేయడంతోపాటు.. మూడు పూటలు ఆహారం అందజేస్తున్నారు. మేము గృహ నిర్భందంలో ఉన్నామనేది అవాస్తవం. వదంతులు నమ్మవద్దు. బీజింగ్‌లోని భారత ఎంబసీతో మాట్లాడాం. త్వరలోనే భారత్‌కు వస్తాం’ అని చెప్పారు. (చదవండి: హైదరాబాద్‌లో ‘కరోనా’ కలకలం..) -
చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్లు..
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ మహమ్మారి బారినపడి ఇప్పటికే 131 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్ కంపెనీకి ఎంపికైన పలువురు ఇంజనీర్లు.. శిక్షణ నిమిత్తం చైనాకు వెళ్లారు. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో తమ పిల్లలను క్షేమంగా భారత్‌కు తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఇప్పటికే 7 విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని 20 విమానాశ్రయాలకు విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. మనవారిని వెనక్కి రప్పిస్తున్నాం.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు చెప్పారు. అయితే అందుకు మరికొద్ది రోజులు పట్టొచ్చనీ, వారిని వెనక్కి తీసుకొచ్చి తీరుతామనీ, స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు. చదవండి : కరోనా వైరస్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య -
సౌదీలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం
- సిరాయా మిస్సైల్ దాడిలో మెదక్ వాసి సహా 60 మంది మృతి - దుబాయ్ లోని జిజాన్ లో సంఘటన మెదక్: అరబ్ దేశాల మద్య జరుగుతోన్న ఆధిపత్యయుద్ధంలో మరో తెలుగు పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉపాధి నిమిత్తం దుబాయ్ లో పనిచేస్తోన్న ఓ తెలుగు ఇంజనీర్ శుక్రవారం జిజాన్ పట్టణంలో అనూహ్యరీతిలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణంలోని ఆజంపురాకు చెందిన ఎండి. లహేక్ హైమద్(34).. బీటెక్ అనంతరం ఉపాధి వెతుక్కుంటూ సౌదీ అరేబియా వెళ్లాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం లభించడంతో దుబాయ్ లోని జిజాన్ ప్రాంతంలో ఉంటున్నాడు. శుక్రవారం సెలవురోజు కావటంతో సమీపంలో ఉండే తన స్నేహితుడ్ని కలుసుకునేందుకు జిజాన్ నుంచి కారులో బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే లహేక్ ప్రయాణిస్తున్న కారుపై సిరియా పేల్చిన మిస్సైల్ వచ్చిపడింది. ఈ ఘటనలో లహేక్ తోపాటు దాదాపు 60 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌదీలోనే ఉంటోన్న అతడి బాబాయి.. లహేక్ మరణవార్తను మెదక్ లోని కుటుంబీకులకు చేరవేశాడు. దీంతో పట్టణమంతా విషాదవాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లహేక్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చేప్రయత్నం చేశారు.