లహేక్ హైమద్(ఫైల్)
- సిరాయా మిస్సైల్ దాడిలో మెదక్ వాసి సహా 60 మంది మృతి
- దుబాయ్ లోని జిజాన్ లో సంఘటన
మెదక్: అరబ్ దేశాల మద్య జరుగుతోన్న ఆధిపత్యయుద్ధంలో మరో తెలుగు పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉపాధి నిమిత్తం దుబాయ్ లో పనిచేస్తోన్న ఓ తెలుగు ఇంజనీర్ శుక్రవారం జిజాన్ పట్టణంలో అనూహ్యరీతిలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణంలోని ఆజంపురాకు చెందిన ఎండి. లహేక్ హైమద్(34).. బీటెక్ అనంతరం ఉపాధి వెతుక్కుంటూ సౌదీ అరేబియా వెళ్లాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం లభించడంతో దుబాయ్ లోని జిజాన్ ప్రాంతంలో ఉంటున్నాడు.
శుక్రవారం సెలవురోజు కావటంతో సమీపంలో ఉండే తన స్నేహితుడ్ని కలుసుకునేందుకు జిజాన్ నుంచి కారులో బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే లహేక్ ప్రయాణిస్తున్న కారుపై సిరియా పేల్చిన మిస్సైల్ వచ్చిపడింది. ఈ ఘటనలో లహేక్ తోపాటు దాదాపు 60 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌదీలోనే ఉంటోన్న అతడి బాబాయి.. లహేక్ మరణవార్తను మెదక్ లోని కుటుంబీకులకు చేరవేశాడు. దీంతో పట్టణమంతా విషాదవాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లహేక్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చేప్రయత్నం చేశారు.