చైనాలోని తెలుగు ఇంజనీర్లు
సాక్షి, చిత్తూరు : ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తున్న వేళ వుహాన్‌లో చిక్కుకున్న 58 మంది తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ పిల్లల ఎలా ఉన్నారో అని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు క్షేమంగానే ఉన్నట్టు టీసీఎల్ హెచ్‌ఆర్ ఆపరేషన్స్ ప్రతినిధి రఘు తెలిపారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. వుహాన్‌లో చైనా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు వారిని అక్కడి నుంచి వెంటనే భారత్‌కు తీసుకురాలేకపోతున్నామని చెప్పారు. బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడామని వీలైనంత త్వరగా వారిని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు తాము క్షేమంగానే ఉన్నామని.. వదంతులు నమ్మవద్దని చైనాలో చిక్కుకున్న ఇంజనీర్లు కోరారు.
గురువారం రఘు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీసీఎల్ తరఫున చైనాలో 89 మంది పనిచేస్తున్నారు. వారిలో 58 మంది వుహాన్‌లో, 17 మంది షెన్‌జెన్‌లో ఉంటున్నారు. 14 మంది గతేడాది నవంబర్‌లోనే ఇండియాకు తిరిగివచ్చారు. షెన్‌జెన్‌లో ఉంటున్న 17 మంది ప్రస్తుతం ఇండియాకు బయలుదేరారు. తెలుగు ఇంజనీర్లను ఇండియాకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కంపెనీ తరఫున వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. వారిని హౌస్ అరెస్ట్ చేశామనడం అవాస్తవం. బయటకు వస్తే వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో రూమ్‌ల్లో ఉంచి షిఫ్టులవారీగా టెంపరెచర్ చెక్ చేస్తున్నాం. ఇంజనీర్లను తరలించేందుకు ఎంబసీ అధికారులతో మా కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. బీజింగ్‌లోని ఎంబసీ అధికారులు అనికేత్ అనే వ్యక్తిని మాకు అపాయింట్ చేశారు. రేపు వుహాన్‌లో ఉన్న ఇంజనీర్లకు టోకెన్లు కేటాయిస్తారు. ఆ తర్వాత వారి ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. ఇంజనీర్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ తరఫున వారికి పూర్తి సాకారం అందజేస్తున్నామ’ని తెలిపారు.(చదవండి : భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’)
వుహాన్‌లో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు మాట్లాడుతూ..‘తాము చైనాలో క్షేమంగానే ఉన్నాం. మేము పనిచేస్తున్న కంపెనీ బాగానే చూసుకుంటోంది. రోజు వైద్య పరీక్షలు చేయడంతోపాటు.. మూడు పూటలు ఆహారం అందజేస్తున్నారు. మేము గృహ నిర్భందంలో ఉన్నామనేది అవాస్తవం. వదంతులు నమ్మవద్దు. బీజింగ్‌లోని భారత ఎంబసీతో మాట్లాడాం. త్వరలోనే భారత్‌కు వస్తాం’ అని చెప్పారు. (చదవండి: హైదరాబాద్‌లో ‘కరోనా’ కలకలం..)
Comments
Please login to add a commentAdd a comment