అందరికీ మాస్కులు | Coronavirus: Three Masks For Each One In AP Says CM YS Jagan | Sakshi
Sakshi News home page

అందరికీ మాస్కులు

Published Mon, Apr 13 2020 2:38 AM | Last Updated on Mon, Apr 13 2020 7:56 AM

Coronavirus: Three Masks For Each One In AP Says CM YS Jagan - Sakshi

కరోనా నియంత్రణపై ఆదివారం జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి వారిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి సిబ్బంది వరకు వివరించి నాణ్యమైన వైద్యం అందించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ మాస్కులు పంపిణీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలోని సుమారు 5.3 కోట్ల మందికి ఒక్కొక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు  అందచేయాలని సూచించారు. మాస్కులు ధరించడం వల్ల కొంత రక్షణ లభిస్తుందని, వీలైనంత త్వరగా వీటిని పంపిణీ చేయాలని పేర్కొన్నారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలు, మూడో విడత ఇంటింటి సర్వే ఫలితాలు, కరోనా కేసుల సరళిపై ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలివీ..
తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

 మూడో విడత సర్వే దాదాపు పూర్తి
► రాష్ట్రంలోని మొత్తం 1.47 కోట్ల కుటుంబాలకుగానూ శనివారం రాత్రి నాటికి 1.43 కోట్ల కుటుంబాల్లో మూడో విడత ఇంటింటి సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 
► అనారోగ్య లక్షణాలున్న 32,349 మందిని ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పరీక్షల కోసం వైద్యాధికారులకు నివేదించారు. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 
మార్కింగ్స్‌ తప్పనిసరి..
► నమోదవుతున్న కేసులు, కరోనా వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను గుర్తించి జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ ఉండాలని, ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

పెద్దల ఆరోగ్యం జాగ్రత్త..
కోవిడ్‌  కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల మందికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య శాఖ సిద్ధమవుతోంది. వైరస్‌ వ్యాప్తి, ఉధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తిస్తున్న జోన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి వారిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి సిబ్బంది వరకు వివరించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.

ఢిల్లీ లింకులతో 360 కరోనా కేసులు..
ఆదివారం ఉదయం 9 గంటల వరకు కరోనా కేసులు 417 నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌  కేసులు 13 కాగా వారి ద్వారా ఇతరులకు సోకిన కేసులు సంఖ్య 12 అని వివరించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ కేసులు 199 కాగా వారి ద్వారా సోకినవారు 161 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతోపాటు వ్యాధి సోకిన వారిని కలవడం, ఇతర మార్గాల ద్వారా కరోనా సోకి పాజిటివ్‌ కేసులు నమోదైన వారు 32 మంది ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement