కార్పొరేట్ వల | Corporate net | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ వల

Published Mon, Feb 17 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

Corporate net

 కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఆరు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు ఇంటర్‌లో ప్రవేశాలకు తెరలేపాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ ‘బుక్’ చేసుకుంటున్నాయి. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులకు నజరానాలు అందిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నా.. అధికారయంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. కార్పొరేట్ కళాశాలలు జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో పీఆర్‌ఓలను నియమించుకున్నా యి. వీరు టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకొని ఇప్పటినుంచే అడ్మిషన్లు బుక్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 20 లోపు ప్రవేశాలకే ఫీజులో రాయితీ ఉం టుందని నమ్మబలుకుతూ కనీసం 60 శాతం ఫీజును ముందే వసూలు చేస్తున్నారు.
 
 ఈ మాత్రమైనా చెల్లించకపోతే ఐడీ నంబర్ రాదని భయపెడుతున్నారు. నిబంధనల ప్రకారం.. పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్‌లో ప్రవేశాలు తీసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్‌ఓల ద్వారా నియామకాలు చేసుకోకూడదు.
 
 అన్ని చోట్లా పీఆర్‌ఓలు...
 జిల్లా కేంద్రం, అన్ని డివిజన్ కేంద్రాలతో పాటు జమ్మికుంట, కోరుట్ల, మెట్‌పల్లి, గోదావరిఖని, వేములవాడ, తదితర ప్రాంతాల్లో పీఆర్‌ఓలను నియమించుకున్నారు. జనంతో ఎక్కువగా సంబంధాలు కలిగివుండే వివిధ సంస్థల ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు వంటివారిని ఏజెంట్లుగా పెట్టుకున్నారు.
 
 వీరికి నెలకు రూ.8 వేల వరకు ఏడాది పొడవునా జీతం రూపంలో చెల్లిస్తున్నారు. పార్ట్‌టైమ్ పీఆర్‌లకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే 10 శాతం వరకు గిట్టుబాటు అవుతోంది. ఈ తాయిలాలకు ఆకర్షితులైన చాలామంది పీఆర్‌ఓలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు వంద దరఖాస్తులు కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు.
 
 స్కూళ్లకు తాయిలాలు..
 విద్యార్థులు చదువుతున్న పాఠశాల నిర్వహకులకు భారీ తాయిలాలు ముట్టచెప్పేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. వందకు పైగా పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలల నిర్వహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు, లేదా ఆ స్థాయి బహుమతులు అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
 
 డబ్బులు గోవిందా....
 కార్పొరేట్ కళాశాలల్లో నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ముందస్తు ప్రవేశాలు తీసుకున్న విద్యార్థుల్లో కనీసం 30 శాతం మంది తీరా పరిసరాలకు అలవాటుపడక అనారోగ్యం పాలవడంతో తిరిగోచ్చే సందర్బాలు ఉంటున్నాయి. ఏ కారణంతో కళాశాల మానేసినా ఫీజు తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందే.
 
 భారీ ఫీజులు..
 ఎంపీసీ ట్రిపుల్‌ఈ పేరుతో ఏడాదికి రూ.80 వేల నుంచి రూ. 90 వేల వరకు ఫీజులు నిర్ణయించారు. ఇదే గ్రూప్ విద్యార్థులు ఎయిర్‌కండీషన్డ్ క్యాంపస్‌ల్లో చదువుకోదలిస్తే రూ.1.25 లక్షల వరకు ఖర్చవుతుంది.
 
 సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌ల్లో సివిల్స్ పౌండేషన్ పేరుతో కొత్త కోర్సును పరిచయం చేస్తూ సుమారు రూ.1.65 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌తో సీఏ, సీపీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షలు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement