‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..’ అన్న చందంగా తయారైంది జిల్లా విద్యాశాఖ పరిస్థితి. అందుకే ఎవరేమనుకున్నా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరించింది. పాఠశాలలో తప్పతాగి.. పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉపాధ్యాయులను పట్టుమని పాతిక రోజులు గడవకముందే.. తిరిగి విధుల్లోకి తీసుకుంది. విద్యాశాఖ అధికారి కె.లింగయ్య శనివారం
వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధ్యాయ లోకం నివ్వెరపోయింది.
సాక్షి, కరీంనగర్ : ఆగస్టు 11.. జిల్లా కేంద్రంలోని ముకరంపుర ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎని మిది మంది పాఠశాలలోనే తప్పతాగారు. పాఠశాలను పానశాలగా మార్చి పోలీ సులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. విద్యాశాఖపై ఒత్తిడి రావడంతో చేసేదిలేక వారిని సస్పెండ్ చేసింది. తీరా 25 రోజులు కూడా గడవకముందే.. వారిని యథాస్థానంలో నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశారు. గురుపూజోత్సవం వరకు వేచి ఉండి.. మరుసటి రోజే ఆర్డర్లు ఇచ్చిన డీఈవో నిర్ణయం తో ఉపాధ్యాయ లోకమంతా నివ్వెరపోయింది. గురుపూజోత్సవానికి ముందే ఆర్డర్లు ఇస్తే వేడుకల్లో ఉపాధ్యాయులు నిలదీస్తారనే ఉద్దేశంతోనే ఈ కొద్దిరోజులు కూడా ఆపేశారని, లేకుంటే వారికి ఎప్పుడో ఆర్డర్లు వచ్చేవి కావచ్చని అనుమానిస్తున్నారు.
కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా వారికి ఎలా పోస్టింగ్ ఇస్తారని సొంత శాఖలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం తాగు తూ పట్టుబడిన ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారికి పోస్టింగ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటే బాగుండని అదే శాఖ లో పని చేస్తున్న ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఆ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం.. శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా అనతికాలంలోనే మళ్లీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారం.. పాఠశాలల్లో తప్పుడు పనులు చేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తే పూర్థిస్థాయిలో విచారణ జరపాలి.
ఇందుకు ఆర్నెల్ల సమయం తీసుకోవాలి. ఆలోపు విచారణ జరిపి ఎప్పుడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. కానీ.. తప్పు చేసి సస్పెండ్‌కు గురైన ఎంతోమందికి నెల, రెండు నెలల్లోపే రీ పోస్టింగ్ ఆర్డర్లు అందుతున్నాయి. గత నెల సస్పెండ్ అయిన ఎనిమిది మందికి ఇంత తొందరగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాల్సిన అంత అవసరం ఇప్పుడు ఏం వచ్చింది..? ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖతోపాటు వృత్తి పరువు, ప్రతిష్టకు మచ్చ తెచ్చిన సదరు ఉపాధ్యాయులకు, డీఈవోకు ఉన్న సాన్నిహిత్యమూ దీనికి కారణమని, అందుకే నెల గడవక ముందే వారికి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది.
విద్యాశాఖ తీసుకుంటు న్న ఇలాంటి నిర్ణయాలు పాఠశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా తప్పుడు పనులు చేస్తున్న.. చే సే ఆలోచన ఉన్న ఉపాధ్యాయులను మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఉన్నాయి. దారి తప్పిన గురువులపై కఠినంగా వ్యవహరించి.. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా అడ్డుకోవాలని ఉపాధ్యాయ సంఘ నేతలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు రీపోస్టింగ్ ఇవ్వడంపై డీఈవోను కె.లింగయ్యను వివరణ కోరగా.. సీసీఏ నిబంధనల మేరకే వారికి పోస్టింగ్ ఇచ్చామని, సస్పెండ్ చేసిన తర్వాత ఆర్నెల్లలోపు ఎప్పుడైనా పోస్టింగ్ ఇచ్చే అధికారం తనకుంద ని, పేర్కొన్నారు. విధుల్లో చేరిన తర్వాత వారిపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
నవ్విపోదురుగాక!
Published Sun, Sep 7 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement