కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్‌వో, వీఆర్‌ఏ నియామక పరీక్షలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వీఆర్‌వో కోసం జిల్లా కేంద్రంతోపాటు 12 పట్టణాల్లో 229 సెంటర్లు, వీఆర్‌ఏకు కరీంనగర్‌లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీఆర్‌వో పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వీఆర్‌ఏ పరీక్ష మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
జిల్లాలో 83 వీఆర్వో పోస్టులకు 93,596 మంది, 223 వీఆర్‌ఏ పోస్టులకు 5,011 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రభుత్వోద్యోగాలు గగనమవుతున్న క్రమంలో వీఆర్‌ఏ, వీఆర్‌వో ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగులను ఊరించింది. పోటీ పరీక్షలో నెగ్గి విజేతగా నిలిచి ఉద్యోగం దక్కించుకోవడం కోసం కఠోర సాధనతో సిద్ధమయ్యారు. పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ విజేతగా నిలుస్తామనే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించేవారు తక్కువే ఉంటారు. దీంతో పోటీ తక్కువే ఉంటుందని పోల్చుకుని ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లినవారే విజయం సాధిస్తారు. అప్పుడు వెయ్యి మందిలో ఒక్కరే చాంపియన్ అవుతారు.
పకడ్బందీ ఏర్పాట్లు
వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలకు జిల్లా యంత్రాగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఆయా పట్టణాల్లో బస్టాండ్‌తో పాటు ముఖ్య కూడళ్లలో పరీక్ష కేంద్రాల రూట్ మ్యాప్‌తో ఫ్లెక్సీలు, పరీక్ష కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల వేలిముద్రలు సేకరించి నకిలీలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పరీక్షలను వీడియో చిత్రీకరించనున్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ జిల్లా కేంద్రం నుంచి ఆయా పట్టణాలకు 230 బస్సులను కేటాయించింది. పరీక్షల సిబ్బంది ఇప్పటికే తమ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 4గంటలకు సంబంధిత తహశీల్దార్లు పరీక్ష పత్రాలను తీసుకెళ్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే అభ్యర్థులు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దూరప్రాంతాల్లో సెంటర్లు పడిన అభ్యర్థులు శనివారం రాత్రికే ఆయా పట్టణాలకు చేరుకున్నారు. బంధువులు, స్నేహితులు లేనివారు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీల్లో తలదాచుకున్నారు. పరీక్ష రోజు అభ్యర్థులు ఒకే సమయంలో భారీగా వచ్చే అవకాశముండడంతో పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశముంది. దీంతో పోలీసుశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
సందేహాలు నివృత్తి : జేసీ ఫోన్ ఇన్‌కు స్పందన
జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఉదయం 10-11 గంటల వరకు ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు అభ్యర్థులు ఫోన్ ద్వారా అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. హాల్‌టికెట్‌పై ఫొటో, వివరాలు సరిగా ఉంటే గుర్తింపుకార్డులు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు.
పరీక్ష జరిగే ప్రాంతాలు
కరీంనగర్, తిమ్మాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, పెద్దపెల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని
వీఆర్‌ఏ పరీక్ష కోసం కరీంనగర్ మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, బొమ్మకల్ బైపాస్‌లోని విట్స్-1. విట్స్-2 ఇంజినీరింగ్ కళాశాలల్లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు.వీఆర్‌వో, వీఆర్‌ఏ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారు ఈ కేంద్రాల్లోనే రెండు పరీక్షలు రాయొచ్చు.
విజయోస్తు
Published Sun, Feb 2 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement