
టవర్‌సర్కిల్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. స్వల్ప తోపులాట అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, పైగా నాయకులను అరెస్టులు చేయిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఉపవాస దీక్షకు కూర్చున్న నేతను అరెస్ట్ చేయడం సామాజిక ఉద్యమాలను అణచివేయడమేనన్నారు. మందకృష్ణను విడుదల చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రేణికుంట్ల సాగర్, గోష్కి అజయ్, గోష్కి శంకర్, జనగామ నర్సింగ్, మాతంగి రమేశ్, గసిగంటి కుమార్, కొయ్యడ వినోద్, సుంచు నరేష్, కొంకటి దేవరాజ్, కనకం నర్సయ్య, చంటికుమార్,రాములు, బాబు, చంద్రశేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.