జెడ్పీ స్థలానికే ఎసరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇరవై ఏళ్ల కిందట అతను జెడ్పీలో అటెండర్.. పక్కా ఇంటి కోసం ఆయనకు 180 చదరపు గజాల జాగాను ప్రభుత్వం కేటాయించింది. అప్పటి ప్రజాప్రతినిధుల సిఫారసుతో జెడ్పీకి చెందిన స్థలంలోనే పట్టా ఇచ్చింది. ఆయన వారసులు తమకు అసైన్ చేసిన స్థలం చుట్టూ ఉన్నదంతా కబ్జా చేశారు.
జిల్లా కేంద్రం నడి బొడ్డున జెడ్పీ క్వార్టర్స్ కాలనీలో 21 గుంటల స్థలానికి ఎసరు పెట్టారు. గోదాంగడ్డ సమీపంలోని ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక్కో గుంట దాదాపు రూ.20 లక్షలు ధర పలుకుతోంది. అంటే అన్యాక్రాంతమైన స్థలం విలువ రూ.4 కోట్ల పైచిలుకు. ఇంత విలువైన స్థలాన్ని సొంతం చేసుకునేందుకు.. రియల్ వ్యాపారులు పంజా విసిరారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తెరపైకి వచ్చిన ఈ కబ్జా వ్యవహారం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది.
ఇటీవలే కబ్జాదారులు ఈ స్థలాన్ని గుట్టుగా ఆంధ్రా బిల్డర్లకు కట్టబెట్టి బహుళ అంతస్థుల భవనం నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ దందా వెనుక ఎవరెవరు ఉన్నారు.. కొత్త పాలకవర్గం కొలువు దీరిన నేపథ్యంలో జిల్లా పరిషత్ స్థలాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. 1981లో జెడ్పీ క్వార్టర్స్ కాంపౌండ్‌లో ఉన్న 982 సర్వే నెంబర్‌లోని జెడ్పీ స్థలంలో 180 చదరపు గజాలు (దాదాపు గుంటన్నర) అందులో పనిచేసే అటెండర్‌కు అసైన్ చేశారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన ఆయన వారసుడితో పాటు మరో ఇద్దరు సోదరులు ఈ స్థలంపై కన్నేశారు.
చుట్టూరా ఉన్న 21 గుంటల స్థలాన్ని తమ అధీనం చేసుకున్నారు. సుద్దాల దేవయ్య జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కాలంలో ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆరేళ్ల కిందట ఈ కబ్జా స్థలం చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించే ప్రయత్నం జరిగింది. అప్పటి జెడ్పీ చైర్మన్ ఆరెపల్లి మోహన్ సూచన మేరకు అప్రమత్తమైన జెడ్పీ అధికారులు... అక్రమ నిర్మాణాలు చేపుడుతున్నారంటూ కూల్చివేశారు. గుంటన్నర భూమిని సాకుగా చూపించి.. అదనంగా 19.5 గుంటలు ఆక్రమించుకున్నట్లుగా గుర్తించారు.
కబ్జాకు గురైన భూమిని తిరిగి తమ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ.. అప్పటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు రాజకీయ నేతల ఒత్తిళ్లతో ఈ ఫైలు ముందుకు కదల్లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం, జెడ్పీకి కొత్త పాలకవర్గం రావటంతో కబ్జాదారులు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేటు బిల్డర్లకు స్థలాన్ని అప్పగించి.. తమవంతుగా వాటాను చేజిక్కించుకునే పనిలో పడ్డారు. జిల్లా పరిషత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ ఆస్తులను కాపాడుకుంటారా...? కళ్లముందు కనిపిస్తున్న కబ్జాకోరుల లీలలకు ఊ కొడతారా...? వేచిచూడాల్సిందే.