బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కొందరు అక్రమార్కులకు వరంలా మారింది. ఈ స్కీంతో కార్పొరేషన్ ఆర్థికాభివృద్ధి చెందుతుందని భావించినా ఆచరణలో అమలయ్యేలా కన్పించడం లేదు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో కొన్ని తిమింగళాలు బీపీఎస్‌ను అడ్డంపెట్టుకుని భోంచేస్తున్నాయి. దీంతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతోందనే ఆరోపణలున్నాయి.
నెల్లూరు, సిటీ: బీపీఎస్ కింద సుమారు పది వేల దరఖాస్తులొస్తాయని, రూ.50 కోట్లు నెల్లూరు కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రాబడుల్లో బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ బీపీఎస్ ఆదాయ అంశాన్ని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అధికారుల అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి.
అవినీతి ఊబిలో టౌన్‌ప్లానింగ్..
కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అవినీతి ఊబిలో కూరుకుపోయారు. బీపీఎస్ ద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం సమకూర్చాల్సిన వారు తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ ఏడాది మే 27వ తేదీన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ, అనధికారిక కట్టడాలు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది.
ఈ క్రమంలో ఈ ఏడాది బడ్జెట్ సమావేశంలోనూ కార్పొరేషన్‌కు కోట్లాది రూపాయల ఆదాయం తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. అయితే అంచనాకు తగ్గట్టు ఆదాయం వచ్చే పరిస్థితి కనుచూపుమేరలో కూడా కన్పించడం లేదు. టౌన్‌ప్లానింగ్‌లో కొందరు అవినీతిపరులు లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
నామమాత్రపు ఫీజుతో సరి..
కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండివేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన వారు క్రమబద్ధీకరణకు అధికారులను సంప్రదించగా వారు నిర్మాణ కొలతల్లో తక్కువ చూపించి నామమాత్రపు ఫీజుతో సరిపెడుతున్నారని సమాచారం. లక్ష రూపాయలు ఆదాయం రావాల్సిన చోటు కేవలం రూ.30 వేలు చెల్లించేలా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు కిరికిరి చేస్తున్నారని తెలిసింది. కొంత నగదు తమ జేబుల్లోకి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సమీక్షలు నిర్వహించని మేయర్, కమిషనర్
బీపీఎస్ ప్రవేశపెట్టిన తర్వాత అమలు తీరు గురించి మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన దాఖలాల్లేవు. బీపీఎస్‌పై ప్రచారం కూడా సరిగా లేకపోవడంతో కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చేలా కనిపించట్లేదు. ఇప్పటికి ఆన్‌లైన్ ద్వారా 1600 దరఖాస్తులు వచ్చాయి. కోటీ 70 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. బీపీఎస్ గడువు ఈ నెల 27తో ముగియనుంది. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. బీపీఎస్ హెల్ప్‌లైన్ కూడా అలంకారప్రాయంగా మారింది.
నా దృష్టికి వస్తే చర్యలు
తీసుకుంటా:
-పీవీవీఎస్ మూర్తి,
కార్పొరేషన్ కమిషనర్
బీపీఎస్ ఆన్‌లైన్ ద్వారా జరిగే ప్రక్రియ. ఏ విధమైన అవినీతి జరిగే అవకాశం లేదు. అలాంటిది ఏమైనా నా దృష్టికి వస్తే టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. దళారులను నమ్మి నగదును ఇవ్వొద్దు. ఆ తరువాత బిల్డింగ్ యజమానులే నష్టపోవాల్సి వస్తుంది.
కార్పొరేషన్ ఖజానాకు గండి
Published Sun, Jul 19 2015 2:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM
Advertisement
Advertisement