- పట్టించుకోని అధికారులు..తిప్పలు పడుతున్న ప్రజలు
సాక్షి, సిటీబ్యూరో: బర్త్ సర్టిఫికెట్ పొందడానికి నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత వ్యవధుల్లోనే బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని.. ఆన్‌లైన్ తో అనుసంధానం చేసిన 108 ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుల బర్త్ సర్టిఫికెట్లు మరింత వేగంగా అందిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు గొప్పలుచెప్పుకుంటున్నప్పటికీ.. అది మాటలకే పరిమితమైంది. గ్రేటర్‌లో ప్రసూతి సదుపాయాలున్న ఆస్పత్రులు దాదాపు వేయివరకు ఉన్నాయి. వీటిల్లో రోజుకు 25 కంటే ఎక్కువ జననాలు జరుగుతున్న 108 ఆస్పత్రుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం ఉంది.
మిగతా ఆస్పత్రుల్లో బర్త్ సర్టిఫికెట్ కావాలంటూ దరఖాస్తు అందాకే సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ సదుపాయం లేని ఆస్పత్రుల్లోని జననాలు జరిగిన బిడ్డల సర్టిఫికెట్ల కోసం త ల్లిదండ్రులు జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనులు కావడం లేవు. ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుల బర్త్ సర్టిఫికెట్లయినా సకాలంలో అందుతున్నాయా అంటే అదీలేదు. ఏ ఆస్పత్రిలో జననం జరిగినా.. జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి బర్త్‌సర్టిఫికెట్ పొందడానికి తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు.
ముడుపులు చెల్లించనిదే పని జరగని పరిస్థితి నెలకొంది. అన్ని ఆస్పత్రుల్లో వెరసి నెలకు సగటున 18వేల శిశువుల జననాలు జరుగుతున్నా, వీటిల్లో కేవలం ఏడువేల జననాలకు సంబంధించి మాత్రమే జీహెచ్‌ఎంసీ రికార్డుల్లో నమోదవుతోంది. అదీ అవసరార్థం వచ్చి చేయితడిపిన వారికి సంబంధించినవే ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా జననాల వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోయినా అధికారులు శ్రద్ధ చూపడం లేరు.
అటకెక్కిన ఉచిత సర్టిఫికెట్..
దేశంలోని మరే కార్పొరేషన్‌లో లేని విధంగా పుట్టిన శిశువులందరికీ ఉచితంగా వారి ఇళ్ల చిరునామాలకే బర్త్ సర్టిఫికెట్లను పంపిణీ చేసే పథకాన్ని అట్టహాసంగా జీహెచ్‌ఎంసీ గతేడాది ప్రారంభించింది. శిశువు పుట్టగానే వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షల సందేశంతోపాటు ఉచిత బర్త్ సర్టిఫికెట్, నిర్ణీత సమయాల్లో శిశువులకు వేయించాల్సిన టీకాల వివరాలను కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. అలా శిశువుల తల్లిదండ్రులకు కొరియర్ ద్వారా ఉచిత బర్త్ సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని గత డిసెంబర్ వరకు అమలు చేసిన యంత్రాంగం.. అనంతరం ఆ విషయాన్ని విస్మరించింది.