
అవినీతి ఖ‘నిజం’
జిల్లాలో సిలికా ఇసుక, క్వార్ట్జ్ మెటల్, గ్రావెల్, బోల్డర్ రాయి తదితర విలువైన ఖనిజ సంపదను రక్షించాల్సిన గనులు, భూగర్భవనరులశాఖ అధికారులు భక్షకులుగా మారారు.
నెల్లూరు సిటీ : జిల్లాలో సిలికా ఇసుక, క్వార్ట్జ్ మెటల్, గ్రావెల్, బోల్డర్ రాయి తదితర విలువైన ఖనిజ సంపదను రక్షించాల్సిన గనులు, భూగర్భవనరులశాఖ అధికారులు భక్షకులుగా మారారు. విలువైన ఖనిజ సంపద పక్క రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులవుతున్నారు. జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి నదుల్లో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సిలికా ఇసుక లభ్యమవుతుంది. పలు రకాల ఔషధాలు, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వినియోగించే సిలికా ఇసుకకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది.
అంతర్రాష్ట ముఠా జిల్లాలోనే తిష్టవేసి రాత్రింబవళ్లు ఈ ఇసుకను తరలిస్తుంటాయి. రవాణాలో అవాంతరాలు ఎదురుకాకుండా సంబంధిత పోలీసు స్టేషన్లు, రవాణాశాఖ అధికారులు, మైనింగ్ అధికారులకు నెల మామూళ్లు ముట్టజెప్తుంటారు. ఈ కోవలో నెల మామూళ్లు ముట్టజెప్పని లారీలను తనిఖీ చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటుంటారు. జిల్లాలోని సైదాపురం, నాయుడుపేట, ఓజిలి, వెంకటగిరి, రాపూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు ఎటువంటి రాయల్టీ చెల్లించకుండానే దర్జాగా తరలిస్తున్నా మైనింగ్ అధికారుల్లో చలనం లేదు. అప్పుడప్పుడు పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు దాడులు చేసి సీజ్ చేసి తమకు అప్పగించిన వాహనాల యజమానుల వద్ద భారీగా ముడుపులు స్వీకరించి వదిలేయడం పరిపాటి. మైనింగ్ అధికారులు తనిఖీలు, దాడులు చేసి వాహనాలను పట్టుకున్న కేసులు జిల్లాలో స్వల్పమే. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం శుక్రవారం నాటి ఘటన. రవాణాశాఖ అధికారులు పట్టుకుని జరిమానా విధించి తమకు అప్పగించిన నాలు గు ఇసుక టిప్పర్ల యజమానుల నుంచి రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన అసిస్ట్టెంట్ జియాలజిస్ట్ సుబ్బారెడ్డి, ఆర్‌ఐ మురారి వంటి అధికారులు, సిబ్బంది జిల్లా గనులశాఖలో కోకొల్లలున్నారు. ఉన్నతాధికారు లు సైతం వీరితో చే తులు కలిపి తమ వాటా తీసుకుని మిన్నకుండి పోతున్నారు. కొందరు ఉన్నతాధికారులు మైనింగ్ కాంట్రాక్టర్ల నుంచి విలాసవంతమైన వస్తువులు సేకరించి చూసీచూడన ట్టు వ్యవహరిస్తూ అపారమైన సంపదను అప్పనంగా వారికి అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.