
ఏ స్థాయిలోనూ అవినీతి ఉండడానికి వీల్లేదు- సీఎం చంద్రబాబు
విజయవాడ బ్యూరో : అవినీతి ఏ స్థాయిలోనూ ఉండడానికి వీల్లేదని, ప్రతి పనిలో పారదర్శకత కన్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ ఇ-ఆఫీసు వ్యవస్థ ఉండి కూడా ఫైళ్లను అపరిష్కృతంగా ఉంచడంలో అర్థం లేదన్నారు. రికార్డులు, ఫైళ్లన్నింటినీ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కుటుంబంలో ఎవరెవరు పెన్షన్లు, ఇళ్లు, స్థలాలు, ఉపకార వేతనాలు, రైతు రుణాలు, రేషన్ సరుకులు తీసుకుంటున్నారో మొత్తం వివరాలు లభ్యమయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజలు పరిష్కారాలనే కోరుకుంటారు కానీ అధికారులు చెప్పే వివరణలను కాదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వ్యయం, గణాకంఆలుపై అధికారులందరికీ పట్టు ఉండాలని స్పష్టం చేశారు. ఫిషరీస్‌లో రానున్న 10 ఏళ్లలో 30 శాతం గ్రోత్ లక్ష్యాన్ని సాధించాలని, రెండు లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నారు.
మెకనైజేషన్, ప్రొసెసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేపల పెంపకంపై దృష్టి పెట్టాలని, చేప తినడం ప్రజల అలవాటుగా మార్చాలని. ఫిషరీస్ మన రాష్ట్రానికి ఉన్న ప్రధానమైన ఆర్థిక వనరని అన్నారు. వ్యవసాయం దాని అనుబంధరంగాల్లో వచ్చే ఏడాది 25 శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. డెయిరీ, ఫిషరీస్, హార్టీకల్చర్ ఈ మూడు గ్రోత్ ఇంజన్స్ అన్నారు. వ్యవసాయం అనుబంధ పరిశ్రమల్లో మధ్యప్రదేశ్ మించిపోవాలన్నారు. ఏపీని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాలని, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుగా నమోదైన 335 పల్లెల్లో తాగునీటిని ఫ్లోరైడ్ రహితంగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని చెరువుల్లో పూడిక తీయించాలని, మారుమూల గ్రామానికి కూడా మంచినీటి సరఫరా జరగాలని కోరారు. పెమాండుతో అద్భుత ఫలితాలు.. డెరైక్టర్ రవీంద్రన్ పెమాండు సంస్కరణలతో తాము మలేషియాలో అవినీతిని అత్యంత కనిష్టస్థాయికి తగ్గించగలిగామని డెరైక్టర్ రవీంద్రన్ మాట్లాడుతూ చెప్పారు. పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ డెలివరీ యూనిట్ (పెమాండు) ప్రిల్యాబ్ మెథడాలజీపై ఆయన కలెక్టర్ల సదస్సులో వివరించారు. మలేషియాలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు ప్రవేశపెట్టామని, వైద్య, ఆరోగ్య సేవలను పునర్ వ్యవస్థీకరించామని వివరించారు. చిల్లర, గరిష్ట విక్రయాలే ప్రధాన ఆర్థిక చోదక శక్తులని చెప్పారు. ల్యాబ్స్ తరహా సంస్కరణలతో స్వయం సహాయక సంఘాలను, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, సంఘటిత, అసంఘటిత పరిశ్రమలను పటిష్టం చేయవచ్చన్నారు. ప్రభుత్వ అధికారులు అశించిన ఫలితాలు సాధించేందుకు పెమాండు తోడ్పడుతుందని రవీంద్రన్ వివరించారు.
ఇ-ప్రగతి శాశ్వత భవనానికి అమరావతిలో స్థలమివ్వాలి ఐటీ అడ్వయిజర్ జె.సత్యనారాయణ జన్మభూమిలో వచ్చిన 73,396 విజ్ఞప్తులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో లబ్ధిదారులతో అవగాహనా సమావేశాలు నిర్వహించాలని, అమరావతిలో ఇ-ప్రగతి శాశ్వత సమాచార కేంద్ర నిర్మాణానికి భూమి కేటాయించాలని సత్యనారాయణ సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐదు వేల క్లాస్ రూములను డిజిటలైజ్ చేశామని, ప్రాధాన్య రంగాలన్నింటినీ పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశామని వివరించారు.