Collectors Convention
-
సీఎం ప్రైవేట్ సన్మాన సభకు ప్రజాధనంతో ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలు సీఎంకు చేస్తున్న సన్మాన కార్యక్రమానికి రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగులను తరలించడానికి వాహనాలు, వచ్చిన వారికి భోజనాలు ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) జీతాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రికి వీఆర్ఏల ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. అది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధంలేని కార్యక్రమం అవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి 1,500 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులను తరలించే బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. దీంతో కలెక్టర్లు ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మండలాల నుంచి గ్రామ రెవిన్యూ సేవకులను విజయవాడలో జరిగే సీఎం సన్మానసభకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్కో ఉద్యోగి తిండి ఖర్చులకు రూ.300 చొప్పన ఇవ్వాలని కలెక్టర్లు తహసీల్దార్లను ఆదేశించారు. విజయవాడకు చేరుకున్న ఉద్యోగులకు అక్కడ బస ఏర్పాటు, సన్మాన కార్యక్రమం అనంతరం ఉద్యోగులకు రాత్రి భోజన వసతి కల్పించే బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. జనాల తరలింపు కార్యక్రమం సజావుగా జరిగేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లైజనింగ్ అధికారులను నియమించడంతో పాటు ప్రతి బస్సుకు ఇద్దరు వీఆర్వోలను నియమించింది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట చంద్రబాబు సర్కార్‌లో ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య తేడా అన్నది లేకుండా పోయిందని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ల సదస్సు నుంచి సీఎం పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు అధికారులు కృషి చేయాలని బాహాటంగానే చెపుతున్నారు. ఉండవల్లిలోని సీఎం అధికార నివాసం వద్ద దాదాపు రూ.5 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజాదర్బార్ హాల్లో పార్టీ కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతున్నాయన్న విమర్శ ఉంది. ప్రజాదర్బార్‌లో శనివారం అంగన్వాడీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాజకీయాల గురించే మాట్లాడడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. -
మనసులో మాట
-
వ్యవసాయంలో ‘ఉపాధి’ లేదు..సేవా రంగమే భేష్
-
వ్యవసాయంలో ‘ఉపాధి’ లేదు.. సేవా రంగమే భేష్
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, అమరావతి: గతంలో వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం కంటే సేవారంగమే మిన్న అని చెప్పారు. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మారాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సేవా రంగం వాటా 70 నుంచి 80 శాతం వరకు ఉంటే, వ్యవసాయ రంగం వాటా కేవలం 4 శాతానికే పరిమితమవుతోందని, సేవల రంగం వృద్ధి చెందితే మౌలిక వసతులు కూడా పెరుగుతాయని అన్నారు. బుధవారం విజయవాడలో ప్రారంభమైన రెండురోజుల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. గతంలో హైదరాబాద్‌లో సేవారంగాన్ని ప్రోత్సహించడం వల్లే మౌలికవసతులు పెరిగాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే టూరిజం, ఆతిథ్యం వంటి రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక వ్యవసాయం అంటే ఉద్యాన పంటలేనని, రైతులను వ్యవసాయం నుంచి ఉద్యానవన పంటల వైపు మారేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన అంశాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్ర వృద్ధి రేటు 11.72 శాతం ‘దేశంలో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతున్నా రాష్ట్రం మాత్రం రెండంకెల వృద్ధిరేటుతో దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశ వృద్ధి రేటు 5.6 శాతం కాగా రాష్ట్రంలో 11.72 శాతం నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కచ్చితంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణ లు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సచివాలయంలో కొన్ని విభాగాలు ఎందుకున్నా యో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇలాంటి అప్రాధాన్య శాఖలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కోల్డ్ చైన్, ఆర్థికాభివృద్ధి, డ్వాక్రా సంఘాల అభివృద్ధి వంటి కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తాం. బయోమెట్రిక్ తప్పనిసరి రేపటి నుంచి (గురువారం) నాతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తాం. అభివృద్ధి కి పుష్కలమైన అవకాశాలున్నా.. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకంజలో ఉండటానికి, తలసరి ఆదాయం తక్కువగా ఉండటానికి నేతలు, అధికార యంత్రాం గం వైఫల్యమే కారణం. ప్రతి మూడు నెలలకు నాతోపాటు అందరి పనితీరును (ప్రోగ్రెస్ రిపోర్టును) సమీక్షించి పాసో, ఫెయిలో తేలుస్తాం’ అని బాబు అన్నారు. తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఏపీ తలసరి ఆదాయంలో రాష్ట్రం తొమ్మిదవ స్థానంలో ఉంది. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. 201718 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,55,000గా పేర్కొంది. అయితే తలసరి ఆదాయంలో రాష్ట్రం 201516 ఆర్థిక సంవత్సరంలో 15.44 శాతం వృద్ధి సాధించగా, 201617లో వృద్ధి 12.14 శాతానికే పరిమితమైంది. తలసరి ఆదాయంలో ఏపీ కన్నా తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాలు ముందున్నాయి. హర్యాణా, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఏపీకన్నా ముందున్నాయి. -
నియోజకవర్గాలకు సర్కారు ర్యాంకులు
జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వెల్లడి సాక్షి, అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి, ఇతర సామాజిక సూచికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాంకులను ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ ర్యాంకులను వెల్లడించారు. గతంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాలతో పాటు తలసరి ఆదాయం ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. అయితే అప్పుడు ప్రకటించిన ర్యాంకులు వాస్తవ అభివృధ్ది ప్రగతి సూచికలను ప్రతిబింబించినట్లు భావించరాదని తాజా ర్యాంకుల నివేదికలో స్పష్టం చేశారు. ఇప్పుడు 14 సూచికల ఆధారంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ప్రకటించిన ర్యాంకులే నిజమైన ప్రగతిని సూచిస్తున్నట్లు కాదని కూడా అదే నివేదికలో పేర్కొనడం గమనార్హం. అంటే అప్పుడు, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ఒక ప్రహసనం అని ప్రభుత్వమే చెప్పకనే చెప్పింది. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, మాతా శిశు మరణాల సంఖ్య, బాలికల ఉత్తీర్ణత, విద్యుత్ వినియోగం, ఎన్టీఆర్ వైద్య సేవ, బహిరంగ మల విసర్జన రహితం, మంచి నీటి కనెక్షన్లు, నీరు–ప్రగతి, రహదారులు, మీ కోసంలో మెరుగైన ఫలితాలు తదితర అంశాల ఆధారంగా తొలి 12, చివరి 12 ర్యాంకులను సదస్సులో ప్రకటించారు. తొలి మూడు ర్యాంకులు పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాలు దక్కించుకున్నాయి. విశాఖలో మరో ఔటర్ రింగ్‌రోడ్: విశాఖ తీరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు సాగరమాలకు తోడు సౌందర్యమాల పేరుతో మరో ఔటర్ రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ట్లు సీఎం ప్రకటించారు. అదేవిధంగా విజయవాడలో బుద్ధమాల, తిరుపతిలలో వైకుంఠమాల పేర్లతో ఔటర్ రింగ్ రోడ్డులను నిర్మించనున్నట్లు తెలిపారు. 26న ఢిల్లీ వెళ్లనున్న సీఎం: ఏపీ సీఎం చంద్రబాబు డిసెంబర్ 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ప్రకటించిన రూ.1,981.54 కోట్ల రుణ పత్రాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందుకోనున్నారు. ఈ పత్రాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా నాబార్డు అందించనుంది. శ్రీలంకకు రండి: సీఎంని కోరిన సిరిసేన: పేదరిక నిర్మూలనపై ప్రసంగించేందుకు శ్రీలంకకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబుని ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. 2017 సంవత్సరాన్ని పేదరిక నిర్మూలన సంవత్సరంగా శ్రీలంక ప్రకటించిం ది. ఈ ఆహ్వానం మేరకు బాబు 8,9 తేదీల్లో శ్రీలంక వెళ్లాలని నిర్ణయించుకున్నారు. -
నేనే రద్దు చేయమన్నా..!
- పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు - కలెక్టర్ల సదస్సులో మళ్లీ మాటమార్చిన బాబు సాక్షి, అమరావతి: నోట్లరద్దు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మాటమార్చారు. తొలుత ఈ ఘనత తనదేనన్నంతగా చెప్పిన సీఎం ప్రజల్లో వ్యతిరేకతను చూసి అబ్బే.. నేను చెప్పలేదనడం తెలిసిందే. మళ్లీ తాజాగా అన్ని సమస్యలకు కారణమవుతున్న పెద్దనోట్లను రద్దు చేయాలని తానే చెప్పానని కలెక్టర్ల సదస్సులో ఆయన ఘనంగా ప్రకటించారు. నోట్ల రద్దును మనం కోరుకోలేదని, ఇబ్బందులున్నాయని ముందు రోజు చెప్పిన ఆయన ఆ మాటలు జాతీయ మీడియాలో ప్రసారం కావడం, ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లడటంతో భవిష్యత్తులో తనకు ఇబ్బం ది అని భావించి మాట మార్చేశారు. పైగా లోటు పాట్లను ప్రస్తావించానే తప్ప నోట్ల రద్దు కు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదం టూ సమర్థించుకున్నారు. విజయవాడలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో సీఎం ప్రసంగించారు. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలు ఇంకా పూర్తి గా పరిష్కారం కాలేదన్నారు. నగదు రహితంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లో రూ.2000 విలువ చేసే బయోమెట్రిక్ డివైస్‌ను అమర్చుకుంటే సర్వీసు చార్జీలు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ డివైస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి రూ.1000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులో దుకాణాలన్నింటినీ నగదు రహితంగా మార్చామని, కలెక్టర్లు, అధికారులు బుధవారం సాయంత్రం షాపింగ్ చేసి తమ అనుభవాలను గురువారం చెప్పాలని సూచించారు. నగదు రహిత కార్యకలాపాలపై నియమించిన సీఎంల కమిటీ ఈనెల 28న సమావేశమవుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ, విద్యుత్‌శాఖల్లో తగ్గని అవినీతి రాష్ట్రంలో రెవెన్యూ, విద్యుత్‌శాఖల్లో అవినీతి తగ్గకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసుశాఖలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేకంగా కెమెరాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్లెక్సీలను రద్దు చేయడానికి అవసరమైతే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. కుటుంబ వికాసానికి 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 సూత్రాలతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ఇక నుంచి విజయవాడలోనే నిర్వహించాలని సూచించారు. రెండో త్రైమాసికంలో 12.23 శాతం వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను సీఎం విడుదల చేశారు. ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని అన్నారు. రెండవ త్రైమాసికంలో 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని, దేశ వృద్ధి రేటు మాత్రం 7.1 శాతం ఉందన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1,981.54 కోట్లు సమకూరినట్లు సీఎం చెప్పారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తనకు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. గృహ నిర్మాణానికి, సిమెంటు రోడ్లకు సిమెంట్ బస్తా రూ.230, ఇతర పనులకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250ల ప్రకారం సిమెంట్ సరఫరా చేయని సిమెంట్ కంపెనీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు. అధికార పార్టీ నేతలు ప్రతిపాదించిన పరిశ్రమలకు అనుమతుల మంజూరులో జాప్యమైతే సహించేదిలేదని సదస్సులో సీఎం కలెక్టర్లను హెచ్చరించినట్లు తెలిసింది. కలెక్టర్లు చెప్పిన అంశాలను పట్టించుకోకుండా తన ఆదేశాలు అమలు చేయాలన్నట్లు తెలిసింది. -
నేడు విజయవాడకు కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు కలెక్టర్ శశిధర్ మంగళవారం విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. -
హైదరాబాద్ నుంచి పనిచేస్తా: సీఎస్ టక్కర్
సీఎం చంద్రబాబుకు వినతి సాక్షి, అమరావతి: ఆరోగ్యం సహకరించడం లేదని, హైదరాబాద్ నుంచి పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ఇటీవల సీఎం చంద్రబాబుకు చెప్పారు. ప్రధాన సమావేశాలకు విజయవాడ వస్తానన్నారు. ఇందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సు అజెండాను టక్కర్ హైదరాబాద్ నుంచే చేపట్టారు. టక్కర్ పదవీ కాలం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంది. -
నేడు కలెక్టర్ల సదస్సు
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల అభివృద్ధి ప్రణాళికల తయారీయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంగణంలోని ప్రగతిభవన్ లో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్లర్లతో పాటు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. కలెక్టర్ల సదస్సులో చర్చించే అంశాల ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. నో యువర్ డిస్టిక్ర్ ్ట(మీ జిల్లా గురించి తెలుసుకోండి).. ప్లాన్ యువర్ డిస్టిక్ట్ర్ (మీ జిల్లా ప్రణాళిక రూపొందించండి) లక్ష్యంగా 20 అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వచ్చిన పరిపాలనా సంస్కరణల ఫలితాలను ప్రజలకు అందించేందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తోంది. స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా ముఖ్యమంత్రి వ్యూహరచన చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్లకు జిల్లాలపై కొంత అవగాహన వచ్చి ఉంటుందని, మరికొన్ని అంశాల్లో కూడా అధ్యయనం చేసేలా వాళ్లకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నిర్దేశించిన ఎజెండాలోని అంశాలపై నివేదికను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. -
‘కొత్త’ లక్ష్యం 8.73 లక్షల ఎకరాలు
నేడు కలెక్టర్లతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, నిర్మాణాలు మొదలైన ప్రాజెక్టులను వేగిరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 2017 డిసెంబర్ నాటికి కొత్తగా 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 12 నెలల్లో 12 ప్రాజెక్టులు... కలెక్టర్ల సదస్సులో చర్చించాల్సిన అంశాలపై నీటిపారుదలశాఖ నివేదిక రూపొందించింది. ఇందులో ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు, వచ్చే మూడేళ్లకు నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఆయకట్టు అంశాలను పొందు పరిచారు. దీని ప్రకారం రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన 1.67 కోట్ల ఎకరాల ఆయకట్టుకుగానూ ఇప్పటివరకు మొత్తంగా 1.18 కోట్ల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళిక వేశారు. ఇందులో ఇప్పటికే 48.15 లక్షల ఎకరాలకు నీరందుతుండగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 69.97 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మొత్తంగా 36 ప్రాజెక్టులు చేపట్టగా మొత్తం 1.96 లక్షల కోట్లకుగానూ రూ. 54 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు 11.21 లక్షల ఎకరాలకు నీరందించగా మరో 3.43 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. 2017 డిసెంబర్ నాటికి ఆరు భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 4.47లక్షల ఎకరాలు, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తిచేసి 4.26 లక్షలు కలిపి మొత్తంగా 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే 2018 నాటికి 2.83 లక్షల ఎకరాలు, 2019 జూన్ నాటికి 23.19 లక్షల ఎకరాలు, 2020 నాటికి 11.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక వేశారు. దీనిపై సీఎం జిల్లాలవారీగా సమీక్షించి కలెక్టర్లకు లక్ష్యాలు వివరించనున్నారు. రబీపైనా స్పష్టత... రబీ సాగుపైనా ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సారెస్పీ కింద సుమారు 9.5 లక్షలు, గోదావరి బేసిన్ పరిధిలో 43 వేలు, జూరాల కింద 60 వేలు, ఆదిలాబాద్ ప్రాజెక్టు కింద 65 వేలు, ఖమ్మం ప్రాజెక్టు కింద 26 వేల ఎకరాలు, నాగార్జున సాగర్ కింద 5 లక్షల ఎకరాల మేర రబీకి సాగు నీటిని అందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరుతడి పంటల సాగుపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టుల పరిధిలో చేయాల్సిన భూసేకరణపై సదస్సులో సీఎం దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ పరిధిలో ఇంకా జరగాల్సిన (మొత్తం 13,983 ఎకరాల్లో 10,925 ఎకరాల భూసేకరణ పూర్తయింది) 3,057 ఎకరాల భూసేకరణను వేగిరం చేయాలని సూచించే అవకాశం ఉంది. -
ఏ స్థాయిలోనూ అవినీతి ఉండడానికి వీల్లేదు- సీఎం చంద్రబాబు
విజయవాడ బ్యూరో : అవినీతి ఏ స్థాయిలోనూ ఉండడానికి వీల్లేదని, ప్రతి పనిలో పారదర్శకత కన్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ ఇ-ఆఫీసు వ్యవస్థ ఉండి కూడా ఫైళ్లను అపరిష్కృతంగా ఉంచడంలో అర్థం లేదన్నారు. రికార్డులు, ఫైళ్లన్నింటినీ స్కాన్ చేసి ఆన్లైన్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కుటుంబంలో ఎవరెవరు పెన్షన్లు, ఇళ్లు, స్థలాలు, ఉపకార వేతనాలు, రైతు రుణాలు, రేషన్ సరుకులు తీసుకుంటున్నారో మొత్తం వివరాలు లభ్యమయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజలు పరిష్కారాలనే కోరుకుంటారు కానీ అధికారులు చెప్పే వివరణలను కాదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వ్యయం, గణాకంఆలుపై అధికారులందరికీ పట్టు ఉండాలని స్పష్టం చేశారు. ఫిషరీస్‌లో రానున్న 10 ఏళ్లలో 30 శాతం గ్రోత్ లక్ష్యాన్ని సాధించాలని, రెండు లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నారు. మెకనైజేషన్, ప్రొసెసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేపల పెంపకంపై దృష్టి పెట్టాలని, చేప తినడం ప్రజల అలవాటుగా మార్చాలని. ఫిషరీస్ మన రాష్ట్రానికి ఉన్న ప్రధానమైన ఆర్థిక వనరని అన్నారు. వ్యవసాయం దాని అనుబంధరంగాల్లో వచ్చే ఏడాది 25 శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. డెయిరీ, ఫిషరీస్, హార్టీకల్చర్ ఈ మూడు గ్రోత్ ఇంజన్స్ అన్నారు. వ్యవసాయం అనుబంధ పరిశ్రమల్లో మధ్యప్రదేశ్ మించిపోవాలన్నారు. ఏపీని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాలని, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుగా నమోదైన 335 పల్లెల్లో తాగునీటిని ఫ్లోరైడ్ రహితంగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని చెరువుల్లో పూడిక తీయించాలని, మారుమూల గ్రామానికి కూడా మంచినీటి సరఫరా జరగాలని కోరారు. పెమాండుతో అద్భుత ఫలితాలు.. డెరైక్టర్ రవీంద్రన్ పెమాండు సంస్కరణలతో తాము మలేషియాలో అవినీతిని అత్యంత కనిష్టస్థాయికి తగ్గించగలిగామని డెరైక్టర్ రవీంద్రన్ మాట్లాడుతూ చెప్పారు. పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ డెలివరీ యూనిట్ (పెమాండు) ప్రిల్యాబ్ మెథడాలజీపై ఆయన కలెక్టర్ల సదస్సులో వివరించారు. మలేషియాలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు ప్రవేశపెట్టామని, వైద్య, ఆరోగ్య సేవలను పునర్ వ్యవస్థీకరించామని వివరించారు. చిల్లర, గరిష్ట విక్రయాలే ప్రధాన ఆర్థిక చోదక శక్తులని చెప్పారు. ల్యాబ్స్ తరహా సంస్కరణలతో స్వయం సహాయక సంఘాలను, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, సంఘటిత, అసంఘటిత పరిశ్రమలను పటిష్టం చేయవచ్చన్నారు. ప్రభుత్వ అధికారులు అశించిన ఫలితాలు సాధించేందుకు పెమాండు తోడ్పడుతుందని రవీంద్రన్ వివరించారు. ఇ-ప్రగతి శాశ్వత భవనానికి అమరావతిలో స్థలమివ్వాలి ఐటీ అడ్వయిజర్ జె.సత్యనారాయణ జన్మభూమిలో వచ్చిన 73,396 విజ్ఞప్తులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో లబ్ధిదారులతో అవగాహనా సమావేశాలు నిర్వహించాలని, అమరావతిలో ఇ-ప్రగతి శాశ్వత సమాచార కేంద్ర నిర్మాణానికి భూమి కేటాయించాలని సత్యనారాయణ సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐదు వేల క్లాస్ రూములను డిజిటలైజ్ చేశామని, ప్రాధాన్య రంగాలన్నింటినీ పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశామని వివరించారు. -
కలెక్టర్ల సదస్సు రెండో రోజు
విజయవాడలోని గేట్ వే హోటల్ లో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. జిల్లాల వారీగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్దిపై కలెక్టర్లు, ఇన్ ఛార్జి మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు, అనుకూలతలు అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు.