నేనే రద్దు చేయమన్నా..!
- పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు
- కలెక్టర్ల సదస్సులో మళ్లీ మాటమార్చిన బాబు
సాక్షి, అమరావతి: నోట్లరద్దు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మాటమార్చారు. తొలుత ఈ ఘనత తనదేనన్నంతగా చెప్పిన సీఎం ప్రజల్లో వ్యతిరేకతను చూసి అబ్బే.. నేను చెప్పలేదనడం తెలిసిందే. మళ్లీ తాజాగా అన్ని సమస్యలకు కారణమవుతున్న పెద్దనోట్లను రద్దు చేయాలని తానే చెప్పానని కలెక్టర్ల సదస్సులో ఆయన ఘనంగా ప్రకటించారు. నోట్ల రద్దును మనం కోరుకోలేదని, ఇబ్బందులున్నాయని ముందు రోజు చెప్పిన ఆయన ఆ మాటలు జాతీయ మీడియాలో ప్రసారం కావడం, ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లడటంతో భవిష్యత్తులో తనకు ఇబ్బం ది అని భావించి మాట మార్చేశారు. పైగా లోటు పాట్లను ప్రస్తావించానే తప్ప నోట్ల రద్దు కు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదం టూ సమర్థించుకున్నారు.
విజయవాడలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో సీఎం ప్రసంగించారు. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలు ఇంకా పూర్తి గా పరిష్కారం కాలేదన్నారు. నగదు రహితంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌లో రూ.2000 విలువ చేసే బయోమెట్రిక్ డివైస్‌ను అమర్చుకుంటే సర్వీసు చార్జీలు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ డివైస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి రూ.1000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులో దుకాణాలన్నింటినీ నగదు రహితంగా మార్చామని, కలెక్టర్లు, అధికారులు బుధవారం సాయంత్రం షాపింగ్ చేసి తమ అనుభవాలను గురువారం చెప్పాలని సూచించారు. నగదు రహిత కార్యకలాపాలపై నియమించిన సీఎంల కమిటీ ఈనెల 28న సమావేశమవుతున్నట్లు తెలిపారు.
రెవెన్యూ, విద్యుత్‌శాఖల్లో తగ్గని అవినీతి
రాష్ట్రంలో రెవెన్యూ, విద్యుత్‌శాఖల్లో అవినీతి తగ్గకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసుశాఖలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేకంగా కెమెరాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్లెక్సీలను రద్దు చేయడానికి అవసరమైతే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. కుటుంబ వికాసానికి 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 సూత్రాలతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ఇక నుంచి విజయవాడలోనే నిర్వహించాలని సూచించారు.
రెండో త్రైమాసికంలో 12.23 శాతం వృద్ధిరేటు
ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను సీఎం విడుదల చేశారు. ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని అన్నారు. రెండవ త్రైమాసికంలో 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని, దేశ వృద్ధి రేటు మాత్రం 7.1 శాతం ఉందన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1,981.54 కోట్లు సమకూరినట్లు సీఎం చెప్పారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తనకు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. గృహ నిర్మాణానికి, సిమెంటు రోడ్లకు సిమెంట్ బస్తా రూ.230, ఇతర పనులకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250ల ప్రకారం సిమెంట్ సరఫరా చేయని సిమెంట్ కంపెనీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు.
అధికార పార్టీ నేతలు ప్రతిపాదించిన పరిశ్రమలకు అనుమతుల మంజూరులో జాప్యమైతే సహించేదిలేదని సదస్సులో సీఎం కలెక్టర్లను హెచ్చరించినట్లు తెలిసింది. కలెక్టర్లు చెప్పిన అంశాలను పట్టించుకోకుండా తన ఆదేశాలు అమలు చేయాలన్నట్లు తెలిసింది.