బ్లాక్ మనీ సంచులు ఇంకా పెరుగుతాయి: చంద్రబాబు
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించేసిన చంద్రబాబు.. ఆ తర్వాత నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నట్లు వ్యవహరించారు. విజయవాడలో చంద్రబాబు బుధవారం రాత్రి నోట్ల రద్దు అంశంపై మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు తప్పు అని చెప్పను.. కానీ అమలుమాత్రం సమర్థవంతంగా జరగాలి అన్నారు. నల్లధనం కంట్రోల్ అవుతుందని చెప్పలేం.. కానీ కొంతమేరకు నల్లధనం తగ్గొచ్చు అని ఆయన పేర్కొన్నారు.
రూ.2వేల నోటు తీసుకురావడం వల్ల బ్లాక్‌మనీ సంచులు మరిన్ని పెరుగుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం మీద వృద్ధిరేటు 7.20గా ఉంటే, ఏపీలో మాత్రం మొదటి ఆరు నెలల్లో 12.33 శాతం వృద్ధిరేటు నమోదైందని చెప్పారు. గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన కేంద్రం సాయం చేయమంటే మాద్రం కుదరదు అన్నారు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు కోసం 40 వేల ఎకరాల భూసేకరణ చేయాలన్నారు. నిర్వాసితులకు 2013 చట్టాల ప్రకారం పరిహారం ఇవ్వాలంటే రూ.25వేల కోట్ల నుంచి 27వేల కోట్లు అవుతుందని తెలిపారు. పోలవరాన్ని అడ్డుకోవాలని, నిర్వాసితులను కొంతమంది రచ్చగొడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.