పోలవరానికి 1,981కోట్ల నాబార్డు రుణం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం జాతీయ సాగునీటి ప్రాజెక్టుకు కేంద్రం నాబార్డు ద్వారా తొలి విడతగా రూ. 1,981.54 కోట్ల రుణాన్ని సమకూర్చింది. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదు గా సీఎం చంద్రబాబు సంబంధిత చెక్కును అందుకున్నారు. ప్రధాన్ మంత్రి కృషి సింఛా యీ యోజన(పీఎంకేఎస్‌వై) కింద 2019 నాటికి 99 ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి గాను నిధులు సమకూర్చేందుకు వీలుగా నాబార్డులో రూ. 20 వేల కోట్లతో దీర్ఘకాలిక సాగునీటి నిధి(ఎల్‌టీఐఎఫ్)ని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 21న తొలిసారిగా నాబార్డు రూ. 1,500 కోట్ల రుణాన్ని వివిధ ప్రాజెక్టులకు గాను కేంద్ర సాయం రూపంలో విడుదల చేసింది.
అలాగే రెండో విడతగా కేంద్ర సాయం రూపంలో రూ. 500 కోట్లు వేర్వేరు ప్రాజెక్టులకు సోమవారం విడుదల చేసింది. వీటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు వాటి ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటాను కూడా నాబార్డు నుంచి రుణ రూపంలో అడిగాయి. ఈమేరకు మహారాష్ట్రకు రూ. 756 కోట్లు, గుజరాత్‌కు రూ. 463 కోట్లు నాబార్డు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు చెక్కులు అందుకున్నారు. ఇక పోలవరం జాతీయ ప్రాజెక్టుకుగాను 2014 తరువాత కేంద్రం రూ. 950 కోట్లు విడుదల చేయగా.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 2,981.54 కోట్లు ఖర్చు అయినట్టు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టిన ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలియపరిచింది. దీనిలో తొలివిడతగా నాబార్డు ద్వారా రూ. 1,981.54 కోట్లను కేంద్రం నాబార్డు రుణం ద్వారా సమకూర్చింది. సంబంధిత చెక్కును కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, ఉమాభారతి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఉమాభారతి, వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు మాట్లాడారు.
త్యాగం చేయాలి: నోట్ల రద్దు అంశాన్ని ప్రజలు స్వాగతి స్తున్నారని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలికంగా కొంత త్యాగం చేయాల ని నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ కన్వీనర్, ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నా రు. సోమవారం ఇక్కడ జాతీయ మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు అంశంపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, ఎలాంటి స్పందనలు ఎదురయ్యాయని మీడియా ప్రశ్నించగా.. ఈ విధంగా స్పందించారు.