పోలవరం ప్రాజెక్టు వద్ద పనులను పరిశీలిస్తున్న కేంద్ర జల సంఘం సభ్యులు
2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరద చంద్రబాబు నిర్వాకం వల్ల కాఫర్ డ్యామ్‌ల ఖాళీల గుండా అధిక ఉధృతితో ప్రవహించింది. దీంతో ఈసీ ఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై రెండు పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2,454 మీటర్ల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి కేవలం 750 మీటర్లకు కుదించుకుపోయి ప్రవహించింది.
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును ఒక మీటర్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్‌డ్యామ్ గ్యాప్–1లో 564 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్‌వాల్‌పై పరుపులా బంకమట్టిని పోసి చేపట్టిన రక్షణ చర్యలను ప్రశంసించింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టిన పనులను పరిశీలించింది. స్పిల్ వే గేట్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.
గోదావరికి ఇటీవల భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వే తదితరాల సామర్థ్యాన్ని పరిశీలించడానికి సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మొహమ్మద్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ ఎంబాక్‌మెంట్స్ విభాగం డైరెక్టర్ దీపక్ చంద్ర భట్, అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ తివారీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఎస్‌ఈ నరసింహమూర్తితో కలిసి ఆదివారం క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–1లో డయాఫ్రమ్‌వాల్, స్పిల్ వే గేట్ల నిర్వహణ, స్పిల్ ఛానల్ తదితరాల సామర్థ్యాన్ని పరీక్షించారు.
ముందు చూపునకు నిదర్శనం
పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల వరద సామర్థ్యానికే గతంలో సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. కానీ జూలై 13న ఎగువన ప్రారంభమైన వరద.. జూలై 16, 17 నాటికి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకునే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వరదను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్ ఎత్తును ఒక మీటర్ పెంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు ఎగువ కాఫర్ డ్యామ్‌లో 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకు మధ్యలో మూడు మీటర్ల వెడల్పుతో మళ్లీ కోర్ (నల్లరేగడి మట్టి)ను నింపారు.
ఆ తర్వాత 43 నుంచి కాఫర్ డ్యామ్ ఎత్తును తొమ్మిది మీటర్ల వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచే పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలించిన సీడబ్ల్యూసీ కమిటీ.. సామర్థ్యాన్ని కూడా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం స్పిల్ వే 48 గేట్లను హైడ్రాలిక్ హాయిస్ట్ విధానంలో నిర్వహిస్తున్నారు. వీటి పనితీరు అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఖయ్యూం మొహమ్మద్ అభినందించారు. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుకు చేపట్టిన పనులను కమిటీ పరిశీలించింది. వరదలు తగ్గాక ఆ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించింది.
నాడు కమీషన్లతో చేటు.. నేడు జగన్ దిద్దుబాటు
► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడినా.. ఆర్థిక ఇబ్బందులున్నా సరే రాష్ట్ర ఖజానా నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు.
► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని 8,808 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. గతేడాది జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. ఇప్పుడు 41.15 పరిధిలోని మిగతా 12,138 కుటుంబాలకు పునరాసం కల్పించే పనులు కొలిక్కి తెస్తున్నారు.
► పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.2,717.85 కోట్లను ఇప్పటికీ కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించి, నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లను పలుమార్లు సీఎం వైఎస్ జగన్ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అనేక సార్లు లేఖలు రాశారు. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం ప్రకారం నిధులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
► పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచు కూడా తగ్గదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 1,06,006 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకనే ప్రాజెక్టులో 194.6 టీఎంసీలు నిల్వ చేస్తామని బాధితులను పరామర్శించిన సమయంలో తేల్చి చెప్పారు.
బాబు కుప్పిగంతులు
అప్పుడు ప్రాజెక్టును నట్టేట ముంచి.. ఇప్పుడు అవకాశం ఇస్తే పూర్తి చేస్తాననడం హాస్యాస్పదం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే సామెత టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అతికినట్లు సరిపోతుందని సాగు నీటి రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం పట్టుపట్టి చంద్రబాబు రాష్ట్ర భుజస్కంధాలపై వేసుకుని, నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రాజెక్టు పనులను మూడు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు చందంగా చేపట్టారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండీ కూడా కనీసం నిర్వాసితుల సమస్య పరిష్కరించలేకపోయారు.
చంద్రబాబు పట్టించుకోకపోవడంతో.. తమకు పునరావాసం కల్పించకుండా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టిస్తున్నారని.. అవి పూర్తయితే తాము మునిగిపోతామని నిర్వాసితులు అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు విన్నవించుకున్నారు. ముందు చేయాల్సిన పనులను చివరలో, చివర చేయాల్సిన పనులను తొలుత చేసి.. కమీషన్లే లక్ష్యంగా ప్రాజెక్టును నట్టేట ముంచారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి చంద్రబాబు.. గతం మరచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కుప్పిగంతులు వేస్తున్నారని ఆశ్యర్యపోతున్నారు.
తనకు తిరిగి అధికారం అప్పగిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తానని, నిర్వాసితులు ఆందోళనకు దిగితే అన్ని విధాలా సహకారం అందిస్తామని రెచ్చగొడుతుండటం సమంజసం కాదని తప్పుపడుతున్నారు. కళ్లెదుట జరగుతున్న పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తుండటం.. నిధుల కోసం సీఎం కృషి చేస్తుండటం చూసి కూడా చంద్రబాబు ఇటీవల వరద ప్రాంతాల పర్యటనలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండటం చూసి సాగు నీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి.
ఆ తప్పిదాలు ఎవరివి?
► పోలవరం ప్రాజెక్టును చేపట్టడం కోసం 2014 మే 24న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేసింది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా, నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి కూడా కావడంతో చంద్రబాబు కోరికను కేంద్రం మన్నించింది. 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. తద్వారా ప్రత్యేక హోదా అంశం గాలిలో కలిసిపోయింది.
► అయితే 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని షరతు విధించింది. అంటే ఆనాటి పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. ఇందులో జల విద్యుత్ ప్రాజెక్టు వ్యయం రూ.2,868.40 కోట్లు. 2014 ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు పోగా మిగిలిన వ్యయం అంటే రూ.8,006.18 కోట్లు మాత్రమే ఇస్తామని ఆ షరతు ద్వారా కేంద్రం పరోక్షంగా తేల్చి చెప్పింది.
► ఈ కారణంగా 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదించి.. ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వడంలో కేంద్ర జల్ శక్తి శాఖ జాప్యం చేస్తూ వస్తోంది. ఇందులో నిర్వాసితుల పునరావాసానికి అయ్యే వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది.
కుడి ఎడమైంది..
► గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి.. ఆ తర్వాత 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టాలి. కాఫర్ డ్యామ్‌లు పూర్తయ్యాక.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయా ఫ్రమ్‌వాల్ చేపట్టాలి. దానిపై ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ఇందుకు భిన్నంగా చేశారు.
► పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కాక 2016 డిసెంబర్ 30 వరకు అంటే అధికారం చేపట్టి 31 నెలలు పూర్తయ్యాక నాటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు.
► స్పిల్ వే పునాది స్థాయి కూడా దాటకుండానే.. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను బావర్–ఎల్‌అండ్‌టీలకు అప్పగించి 2018 నాటికే పూర్తి చేశారు. పీపీఏ ఆదేశాలను లెక్కలేయకుండా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టారు. పైగా కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా.. ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. దీంతో వరద ఉధృతి వల్ల జరగరాని నష్టం జరిగిపోయింది. అందువల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment