సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నేటితో ముగియాల్సిన టెండర్ల ప్రక్రియను జనవరి 5వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.1,483 కోట్లతో ఏపీ సర్కార్ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేంద్రమంత్రి గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టెండర్లు కొనసాగించవద్దని గడ్కరీ ఆదేశించినా ప్రభుత్వం టెండర్లను రద్దు చేయలేదు. నెలరోజుల పాటు ట్రాన్స్‌ట్రాయ్‌కు అవకాశం ఇవ్వాలని సూచించినప్పటికీ, టెండర్ల షెడ్యూల్ పొడిగింపు ఎత్తుగడకు ఏపీ సర్కార్ తెరతీసింది.
కాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ పనుల కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కేంద్ర జలవనరుల శాఖ తప్పుపట్టింది. అంతర్జాతీయ టెండర్లు పిలిచినపుడు 45 రోజులు గడువు ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 18 రోజులే గడువిచ్చింది. దాంతో కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే టెండర్ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తూనే, దాని గడువును పెంచనున్నామని ఏపీ అధికారులు తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి గడ్కరీ ఈనె ల23న పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment