సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల అభివృద్ధి ప్రణాళికల తయారీయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంగణంలోని ప్రగతిభవన్ లో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్లర్లతో పాటు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. కలెక్టర్ల సదస్సులో చర్చించే అంశాల ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. నో యువర్ డిస్టిక్ర్ ్ట(మీ జిల్లా గురించి తెలుసుకోండి).. ప్లాన్ యువర్ డిస్టిక్ట్ర్ (మీ జిల్లా ప్రణాళిక రూపొందించండి) లక్ష్యంగా 20 అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో వచ్చిన పరిపాలనా సంస్కరణల ఫలితాలను ప్రజలకు అందించేందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తోంది. స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా ముఖ్యమంత్రి వ్యూహరచన చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్లకు జిల్లాలపై కొంత అవగాహన వచ్చి ఉంటుందని, మరికొన్ని అంశాల్లో కూడా అధ్యయనం చేసేలా వాళ్లకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నిర్దేశించిన ఎజెండాలోని అంశాలపై నివేదికను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు.