
‘కొత్త’ లక్ష్యం 8.73 లక్షల ఎకరాలు
నేడు కలెక్టర్లతో సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, నిర్మాణాలు మొదలైన ప్రాజెక్టులను వేగిరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 2017 డిసెంబర్ నాటికి కొత్తగా 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
12 నెలల్లో 12 ప్రాజెక్టులు...
కలెక్టర్ల సదస్సులో చర్చించాల్సిన అంశాలపై నీటిపారుదలశాఖ నివేదిక రూపొందించింది. ఇందులో ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు, వచ్చే మూడేళ్లకు నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఆయకట్టు అంశాలను పొందు పరిచారు. దీని ప్రకారం రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన 1.67 కోట్ల ఎకరాల ఆయకట్టుకుగానూ ఇప్పటివరకు మొత్తంగా 1.18 కోట్ల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళిక వేశారు. ఇందులో ఇప్పటికే 48.15 లక్షల ఎకరాలకు నీరందుతుండగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 69.97 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మొత్తంగా 36 ప్రాజెక్టులు చేపట్టగా మొత్తం 1.96 లక్షల కోట్లకుగానూ రూ. 54 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు 11.21 లక్షల ఎకరాలకు నీరందించగా మరో 3.43 లక్షల ఎకరాలను స్థిరీకరించారు.
2017 డిసెంబర్ నాటికి ఆరు భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 4.47లక్షల ఎకరాలు, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తిచేసి 4.26 లక్షలు కలిపి మొత్తంగా 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే 2018 నాటికి 2.83 లక్షల ఎకరాలు, 2019 జూన్ నాటికి 23.19 లక్షల ఎకరాలు, 2020 నాటికి 11.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక వేశారు. దీనిపై సీఎం జిల్లాలవారీగా సమీక్షించి కలెక్టర్లకు లక్ష్యాలు వివరించనున్నారు.
రబీపైనా స్పష్టత...
రబీ సాగుపైనా ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సారెస్పీ కింద సుమారు 9.5 లక్షలు, గోదావరి బేసిన్ పరిధిలో 43 వేలు, జూరాల కింద 60 వేలు, ఆదిలాబాద్ ప్రాజెక్టు కింద 65 వేలు, ఖమ్మం ప్రాజెక్టు కింద 26 వేల ఎకరాలు, నాగార్జున సాగర్ కింద 5 లక్షల ఎకరాల మేర రబీకి సాగు నీటిని అందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరుతడి పంటల సాగుపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టుల పరిధిలో చేయాల్సిన భూసేకరణపై సదస్సులో సీఎం దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ పరిధిలో ఇంకా జరగాల్సిన (మొత్తం 13,983 ఎకరాల్లో 10,925 ఎకరాల భూసేకరణ పూర్తయింది) 3,057 ఎకరాల భూసేకరణను వేగిరం చేయాలని సూచించే అవకాశం ఉంది.