సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలు సీఎంకు చేస్తున్న సన్మాన కార్యక్రమానికి రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగులను తరలించడానికి వాహనాలు, వచ్చిన వారికి భోజనాలు ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) జీతాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రికి వీఆర్‌ఏల ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. అది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధంలేని కార్యక్రమం అవుతుంది.
అయితే ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి 1,500 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులను తరలించే బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. దీంతో కలెక్టర్లు ఆర్డీవోలు, తహసీల్దార్‌లకు ఉత్తర్వులు జారీ చేశారు. మండలాల నుంచి గ్రామ రెవిన్యూ సేవకులను విజయవాడలో జరిగే సీఎం సన్మానసభకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్కో ఉద్యోగి తిండి ఖర్చులకు రూ.300 చొప్పన ఇవ్వాలని కలెక్టర్లు తహసీల్దార్‌లను ఆదేశించారు. విజయవాడకు చేరుకున్న ఉద్యోగులకు అక్కడ బస ఏర్పాటు, సన్మాన కార్యక్రమం అనంతరం ఉద్యోగులకు రాత్రి భోజన వసతి కల్పించే బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. జనాల తరలింపు కార్యక్రమం సజావుగా జరిగేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లైజనింగ్ అధికారులను నియమించడంతో పాటు ప్రతి బస్సుకు ఇద్దరు వీఆర్‌వోలను నియమించింది.
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
చంద్రబాబు సర్కార్‌లో ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య తేడా అన్నది లేకుండా పోయిందని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ల సదస్సు నుంచి సీఎం పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు అధికారులు కృషి చేయాలని బాహాటంగానే చెపుతున్నారు. ఉండవల్లిలోని సీఎం అధికార నివాసం వద్ద దాదాపు రూ.5 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజాదర్బార్ హాల్‌లో పార్టీ కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతున్నాయన్న విమర్శ ఉంది. ప్రజాదర్బార్‌లో శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాజకీయాల గురించే మాట్లాడడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.
సీఎం ప్రైవేట్ సన్మాన సభకు ప్రజాధనంతో ఏర్పాట్లు
Published Mon, Jun 25 2018 4:10 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment