నియోజకవర్గాలకు సర్కారు ర్యాంకులు
జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి, ఇతర సామాజిక సూచికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాంకులను ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ ర్యాంకులను వెల్లడించారు. గతంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాలతో పాటు తలసరి ఆదాయం ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. అయితే అప్పుడు ప్రకటించిన ర్యాంకులు వాస్తవ అభివృధ్ది ప్రగతి సూచికలను ప్రతిబింబించినట్లు భావించరాదని తాజా ర్యాంకుల నివేదికలో స్పష్టం చేశారు.
ఇప్పుడు 14 సూచికల ఆధారంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ప్రకటించిన ర్యాంకులే నిజమైన ప్రగతిని సూచిస్తున్నట్లు కాదని కూడా అదే నివేదికలో పేర్కొనడం గమనార్హం. అంటే అప్పుడు, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ఒక ప్రహసనం అని ప్రభుత్వమే చెప్పకనే చెప్పింది. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, మాతా శిశు మరణాల సంఖ్య, బాలికల ఉత్తీర్ణత, విద్యుత్ వినియోగం, ఎన్టీఆర్ వైద్య సేవ, బహిరంగ మల విసర్జన రహితం, మంచి నీటి కనెక్షన్లు, నీరు–ప్రగతి, రహదారులు, మీ కోసంలో మెరుగైన ఫలితాలు తదితర అంశాల ఆధారంగా తొలి 12, చివరి 12 ర్యాంకులను సదస్సులో ప్రకటించారు. తొలి మూడు ర్యాంకులు పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాలు దక్కించుకున్నాయి.
విశాఖలో మరో ఔటర్ రింగ్‌రోడ్: విశాఖ తీరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు సాగరమాలకు తోడు సౌందర్యమాల పేరుతో మరో ఔటర్ రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ట్లు సీఎం ప్రకటించారు. అదేవిధంగా విజయవాడలో బుద్ధమాల, తిరుపతిలలో వైకుంఠమాల పేర్లతో ఔటర్ రింగ్ రోడ్డులను నిర్మించనున్నట్లు తెలిపారు.
26న ఢిల్లీ వెళ్లనున్న సీఎం: ఏపీ సీఎం చంద్రబాబు డిసెంబర్ 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ప్రకటించిన రూ.1,981.54 కోట్ల రుణ పత్రాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందుకోనున్నారు. ఈ పత్రాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా నాబార్డు అందించనుంది.
శ్రీలంకకు రండి: సీఎంని కోరిన సిరిసేన: పేదరిక నిర్మూలనపై ప్రసంగించేందుకు శ్రీలంకకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబుని ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. 2017 సంవత్సరాన్ని పేదరిక నిర్మూలన సంవత్సరంగా శ్రీలంక ప్రకటించిం ది. ఈ ఆహ్వానం మేరకు బాబు 8,9 తేదీల్లో శ్రీలంక వెళ్లాలని నిర్ణయించుకున్నారు.