
అందినకాడికి నొక్కుడు..
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడున్నర ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అందినోడికి అందినంత తరహాలో దోచుకుంటున్నారు.
చిలకలూరిపేట రూరల్,
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడున్నర ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అందినోడికి అందినంత తరహాలో దోచుకుంటున్నారు. ఆదాయ వనరులు ఉన్న విధులు ఒకరికి, సాధారణ బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిపోయింది. యార్డులో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో మరో 16 మందిని తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నిర్ణయించుకున్న లక్ష్యాలను అధిగమించాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా టార్గెట్‌లను సమం చేసి మిగిలిన మొత్తాన్ని జేబుల్లో నింపుకుంటున్నారు.
అంతా ఒక్కడే.. యార్డు ఉద్యోగులు సమానంగా విధులు నిర్వహించాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఒక్కడే అంతా తానై పర్యవేక్షించి సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ఆదాయాన్ని అందించే చెక్‌పోస్టు విధులు, డాల్‌మిల్లులు, రైస్‌మిల్లులు, గొర్రెల మండి బాధ్యతలతో మెబైల్ టీంగా వ్యవహరిస్తూ అందినకాడికి అందినంతగా జమ చేసుకోవడం గమనార్హం. డాల్ మిల్లుల ద్వారా జీరో బిజినెస్, సెస్‌ల చెల్లింపులు, ఒక శాతం యార్డు పన్ను, దిగుమతి అయ్యే ప్రతి ఒక్క లారీ నుంచి మూడు వేల రూపాయల సెస్ కట్టించుకోవాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
సంతలో రశీదులు నిల్.. ప్రతి వారం లక్షలాది రూపాయల వ్యాపారం జరిగే పశువుల సంత వద్ద యార్డు సిబ్బంది రశీదులు రాయాల్సి ఉంది. సంత నుంచి స్థానికేతర ప్రాంతాలకు పశువులు తరలి వెళితే మరో రశీదు రాయాలి. సిబ్బంది నామమాత్రంగా రశీదులు రాసి మిగిలిన సొమ్ము స్వంత ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు.
లింక్ రోడ్ల ప్రతిపాదనలు లేవు..
గ్రామాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చేందుకు అవసరమైన లింక్ రోడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యార్డు అధికారులు గ్రామాల్లో అవసరమైన రోడ్లు గుర్తించి వాటి ప్రతిపాదనలు అందించాల్సి ఉంది సిబ్బంది ఒక్క ప్రతిపాదన పంపకపోవడంతో నిధులు రాలేదు.
బాధ్యతలు సమానంగా పంపిణీ చేశాం..
దీనిపై మార్కెట్ యార్డు కార్యదర్శి కె.నాగవేణిని వివరణ కోరగా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందని, ఉన్న వారిలో అందరికీ సమానంగా బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. లింక్‌రోడ్లు ఏర్పాటు ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారని, అందుకే ప్రతిపాదనలు చేయలేకపోయామని తెలిపారు.