
నంద్యాలలోని ఈఓ వీరయ్య ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు(ఫైల్)
కర్నూలు(న్యూసిటీ) : దేవదాయ, ధర్మాదాయ శాఖకు అవినీతి మకిలి పట్టింది. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఈ శాఖ అధికారులు కూడా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు సర్వత్రా ఆరోపణలున్నాయి. వీటిని నిజం చేస్తూ కొంతమంది అధికారులు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. మూడేళ్లలో నలుగురు అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడడం ఆ శాఖ అవినీతిని తేటతెల్లం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో 3888 ఆలయాలున్నాయి. ఇందులో 6ఏ గ్రూపు దేవాలయాలు 10, 6బీ ఆలయాలు 88, 6సి ఆలయాలు 3780 ఉన్నాయి. 6ఎ గ్రూపు ఆలయాల్లో ఒక్కో ఆలయ ఆదాయం ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటికిపైగా ఉంటుంది.
పరువుతీసిన అధికారులు
శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్న జీవీ సాగర్‌బాబు 2016 సెప్టెంబర్‌లో ఏసీబీకి చిక్కారు. ఈయన దేవస్థానం అభివృద్ధి పనులు, ఉద్యోగుల బదిలీల విషయంలో చేతివాటం ప్రదర్శించి రూ.3 కోట్ల ఆస్తులను అక్రమంగా కూడగట్టారని ఏసీబీ అధికారులు తేల్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో మల్లికార్జునుడు, భ్రమరాంబదేవీల పూజలో పాల్గొంటుండగా ఆలయ ఈఓగా ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడి శ్రీశైల ఆలయ పరువు తీశారు.గతేడాది ఫిబ్రవరి నెలలో పత్తికొండలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనిచేస్తున్న పురోహితుడు తండ్రి మరణిస్తే కుమారుడు ఎక్స్‌గ్రేషియా కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి చివరకు ఏíసీబీ అధికారులను ఆశ్రయించారు. సహాయ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బిందుబాయికి రూ.5 వేలు, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు రూ. 2 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కొరవడిన పర్యవేక్షణ..
జిల్లాలోని పలు ఆలయాలకు రూ.లక్షల్లో ఆదా యం సమకూరుతోంది. ఆలయాలకు సంబం« ధించిన వ్యవహారాలన్నీ ఈఓ చేతుల మీదుగా జరుగుతాయి. ఈక్రమంలో కొందరు ఈఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈఓలు, దేవదాయ శాఖ సిబ్బంది అక్రమాల్లో మునిగి తేలుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల వీరయ్య..
ఇటీవల ఓంకారేశ్వరస్వామితో పలు గ్రూపు ఆలయాల ఈఓగా ఉన్న వీరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దాడుల్లో ఏకంగా రూ.10 కోట్ల విలువైన ఆస్తులు దొరికినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. వీరయ్య వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదంగా ఉంది. దేవదాయశాఖలో క్లర్కుగా చేరిన ఈయన పదోన్నతిపై కార్యనిర్వహణా««ధికారిగా పదోన్నతి పొందారు. ఆతర్వాత 2000లో సహాయ కమిషనర్ కార్యాలయంలో పర్యవేక్షకుడుగా పనిచేశారు. 2002లో గూడూరు మండలం నాగలాపురంలో ఉన్న సుంకులాపరమేశ్వరి ఆలయ ఈఓగా పనిచేశారు. 2009 నుంచి ఓంకారేశ్వరస్వామితోపాటు పలు గ్రూపు ఆలయాలకు ఈఓగా వ్యవహరిస్తున్నారు. అయితే విధి నిర్వహణలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే ఏసీబీ అధికారులు ఈనెల 10న దాడులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment