
ఉపాధిలో తవ్వేకొద్దీ అవినీతి
గొలుగొండ : మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. పనులు జరిగినట్టుగా రికార్డుల్లో సిబ్బంది నమోదు చేసి అందినంత దోచుకున్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపిన అధికారులు ఏపీవో, కంప్యూటర్ ఆపరేటర్, కొత్త ఎల్లవరం ఫీల్డు అసిస్టెంట్లను నాలుగు రోజులక్రితం విధుల నుంచి తప్పించడం తెలిసిందే. తాజాగా మంగళవారం మరో ముగ్గురు ఫీల్డు అసిస్టెంట్లను విధులనుంచి తొలగిస్తున్నట్టు ఏపీవో సుప్రియ తెలిపారు.
ఇలా వెలుగులోకి...
మండలంలో 2011 నుంచి 2015 వరకు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుపేద రైతులకు ప్రభుత్వం ఉపాధి నిధులతో జీడితోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు 15 రోజులక్రితం గొలుగొండలో జరిగిన ప్రజా నివేదికలో డీఆర్పీలు జిల్లా అధికారుల దృష్టికి తెచ్చారు. మండలంలోని 13 పంచాయతీల్లో ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. చాలాచోట్ల మొక్కల పెంపకం చేపట్టకుండానే లబ్ధిదారుల పేరిట నిధులు స్వాహా చేశారు. ఈ విషయాన్ని ఉపాధి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చర్యలు చేపట్టారు.
మంత్రి సీరియస్
మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ తరహా అవినీతి జరగడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిలో భాగంగానే రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.
బాధ్యులందరిపై చర్యలు
మండలంలోని ఉపాధి పనుల్లో భారీ స్థాయిలో జరిగిన అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్టు ఎంపీడీవో బలరాముడు తెలిపారు. అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఏయూ విద్యార్థులను నియమించినట్లు ఆయన వివరించారు.