ఇంజినీర్ల మెడకు పీఎఫ్ ఉచ్చు! | corruption in gvmc water supply section | Sakshi
Sakshi News home page

ఇంజినీర్ల మెడకు పీఎఫ్ ఉచ్చు!

Published Wed, Sep 10 2014 3:04 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

corruption in gvmc water supply section

సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో కాంట్రాక్ట్ కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ కేసు ఇంజినీర్ల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే 29 మంది కాంట్రాక్టర్లపై పీఎఫ్ కేసు నడుస్తోంది. బకాయిలున్న కాంట్రాక్టర్లలో 11 మంది బిల్లులు జీవీఎం సీ వద్దే ఉండటంతో వాటిని నిలిపేశారు. మిగిలిన వారిపై క్రిమినల్ కేసులతోపాటు, ఆయా సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇపుడు క్షేత్రస్థాయిలోనే సమస్యను పట్టించుకోని ఇంజినీరింగ్ సిబ్బందిపై దృష్టి సారించారు. సుమారు 60 మందికి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ షోకాజ్‌నోటీసులు జారీ చేశారు.

 దీనికి బాధ్యులెవరు?
 నిబంధనల మేరకు పీఎఫ్ కోడ్, లేబర్ లెసైన్సు లేని సంస్థలకు పనులు కేటాయించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో కేటాయించినా బిల్లులు చెల్లించే నాటికి పీఎఫ్ కోడ్, లేబర్ లెసైన్సు పొంది ఉండాలి. అప్పటికీ పీఎఫ్ కోడ్ లేకపోతే కార్మికుని వేతనంలో పీఎఫ్ (25.61 శాతం), ఈఎస్‌ఐ(6.50 శాతం) మినహాయించి మిగిలిన మొత్తం మాత్రమే ఆ కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. ఇవేవీ లేకుండా 2009 ఏప్రిల్ నుంచి 2012  ఫిబ్రవరి వరకూ 4 కోట్ల 70 లక్షల 19 వేల 868 రూపాయలు(పీఎఫ్), కోటీ 22 లక్షల 25 వేల 165 రూపాయలు (ఈఎస్‌ఐ) జీవీఎంసీ ద్వారా 29 మంది కాంట్రాక్టర్లు అందుకున్నారు. వీటిని క్షేత్ర స్థాయిలోనే గుర్తించి సహాయ ఇంజినీరు(ఏఈ) చెక్ పెట్టాలి. అక్కడి నుంచి డీఈ, ఈఈలు కూడా బాధ్యత వహించాలి.

 మాకేంటి సంబంధం!
 తాజా నోటీసులపై ఇంజినీరింగ్ సిబ్బంది గుర్రుగా ఉన్నారు. అత్యవసర కేటగిరీలో భాగంగా సిబ్బందితో పనులు చేయించడం వరకు తమ బాధ్యతని చెప్తున్నారు. వారు పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించారో.. లేదో.. తమకేంటి సంబంధమని ప్రశ్నిస్తున్నారు. పనుల వరకు లోపాలుంటే తాము బాధ్యులం తప్ప.. పీఎఫ్, ఈఎస్‌ఐ వ్యవహారాలు ఫైనాన్స్, ఆడిట్ విభాగాలే చూసుకోవాలని చెప్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement