వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి జాఢ్యం
కాకినాడ క్రైం : వైద్య,ఆరోగ్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నియామకాలు జరుగుతున్నాయని ఆ శాఖ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు. ఉన్నతస్థాయిలో అవినీతి వల్ల సీనియర్లకు సైతం అన్యాయం జరుగుతోందంటున్నారు. తాజాగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) పోస్టు భర్తీయే అందుకు సాక్ష్యమంటున్నారు. గతంలో పిఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న వైద్యురాలిని రెండేళ్ల ఫారిన్ సర్వీసెస్ కాంట్రాక్టులో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జెబార్) జిల్లా కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పట్టుమని పది నెలలు కాకుండానే ఆమెను డీఐఓ పోస్టులో నియమించారు. ఈ విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులు సైతం నిబంధనలను తుంగలో తొక్కారని వైద్య సిబ్బంది విమర్శిస్తున్నారు.
గగ్గోలుపెడుతున్న సీనియర్లు
డీఐఓ డాక్టర్ బి.మురళీకృష్ణ గొంతు సంబంధిత రుగ్మతతో బాధపడుతుండడంతో ఆయనను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఆయన స్థానంలోకి రావాలని ముమ్మిడివరం ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ కేశవ ప్రసాద్, కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ ఆర్.రాజేశ్వరి, పెదపూడి ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ వి.వెంకట్రావు ప్రయత్నించారు. పలువురు సీనియర్లున్నా రాత్రికి రాత్రే జెబార్ కో-ఆర్డినేటర్‌ను నియమించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఆమె నియామకంపై జీఓ కూడా విడుదల కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. అంతేకాక బదిలీలపై నిషేధం ఎత్తివేశాక కౌన్సెలింగ్ నిర్వహించి డీఐఓ పోస్టు భర్తీ చేయాల్సి ఉండగా భారీగా ముడుపులు అందుకున్నందునే ఉన్నతాధికారులు అడ్డగోలు నియామకాలకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏఓ స్థానం కోసమేనా?
వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ) పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉండడంతో ఇటీవల జెబార్ కో-ఆర్డినేటర్‌ను ఇన్‌చార్జ్ ఏఓగా నియమిస్తూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. పవన్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఏఓగా పనిచేసేందుకు కార్యాలయంలో నలుగురు ఉద్యోగులకు అర్హతలున్నా ఆ వైద్యురాలికే ఇన్‌చార్జ్ ఏఓ స్థానం అప్పగించడం వెనుక మర్మమేమిటని కార్యాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఏఓ స్థానాన్ని ఆమెకు పూర్తిస్థాయిలో అప్పగించేందుకే డీఐఓ పోస్టు కట్టబెట్టారంటున్నా. ప్రస్తుతం ఆ వైద్యురాలు జెబార్ కో-ఆర్డినేటర్‌గా, డీఐఓగా, ఏఓగా విధులు నిర్వహిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎఫ్‌ఆర్‌టీసీ వైద్యాధికారి పదవికీ గండం..
ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ) వైద్యాధికారి పదవికి కూడా గండం పొంచి ఉంది. పిఠాపురం పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఓ వైద్యాధికారికి ఆ పోస్టును అడ్డదారిలో అప్పగించేందుకు భారీగా ముడుపులు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.