♦ ఉక్కు కొంటే బుక్కయినట్టే..
♦ భవానీపురం ఐరన్ యార్డులో మాయామశ్చీంద్రుల హల్‌చల్
♦ దళారుల ఉచ్చులో పడితే జేబుకు చిల్లే..
♦ తూకంలో భారీ మోసాలు : వినియోగదారులకు కుచ్చుటోపీ
♦ ముడుపుల మత్తులో తూనికలు, కొలతల శాఖ అధికారులు
భవానీపురం : రాష్ట్రంలోనే అతిపెద్దదిగా పేరొందిన భవానీపురం ఐరన్ యార్డులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఐరన్ వ్యాపారుల్లోని కొందరు మాయామశ్చీంద్రలు బరితెగించి వ్యాపారం సాగిస్తున్నారు. ఇనుము కొనేందుకు వచ్చిన వారిని తక్కువ తూకంతో బురిడీ కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన సూత్రధారి సుమారు 30మంది యువకులకు లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి, ద్విచక్ర వాహనాలను ఏర్పాటుచేసి తన షాపుల తరఫున దళారులుగా నియమించుకోవడం విశేషం. వీరంతా ఐదు బృందాలుగా విడిపోయి వారికి అనుకూల షాపుల్లో ఏదో ఒక దానికి ఐరన్ కొనిచ్చి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. ఈ దళారుల బృందం పుణ్యమా అంటూ అనతికాలంలోనే వ్యాపారంలో విజృంభించిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలతో ‘నరసింహా’వతారం ఎత్తాడు.
ఎలా మోసం చేస్తారంటే...
ఇనుము కొనేందుకు వచ్చే వారిని యార్డులోకి వెళ్లకుండా బైపాస్ రోడ్డులోనే ఈ బృందంలోని కొందరు చుట్టుముడతారు. ఉదాహరణకు ఆ రోజు టన్ను ఇనుము ధర రూ.40వేలు ఉంటే వీరు నాలుగైదు వేలు తక్కువ చెబుతారు. వినియోగదారుడికి నమ్మకం కలిగాక కొంచెం ముందుకు వెళితే, అక్కడా అతనిని చుట్టేస్తారు. మొత్తంమ్మీద ఈ బృందంలోని వారంతా కలిసి ఇతర షాపుల్లోకి వెళ్లకుండా వారిని పోషించే షాపునకు వినియోగదారులను మళ్లిస్తుంటారు.
కాటాలో బురిడీ
కొనుగోలు చేసిన ఇనుమును తరలించేందుకు అవసరమైన ఖాళీ లారీని కాటా దగ్గరకు తీసుకువెళతారు. లారీ టన్ను బరువు ఉందనుకుంటే దళారుల సూచనల మేరకు అరటన్ను మైనస్ చూపిస్తారు. ఆ మేరకు కాటా నిర్వాహకులు బిల్లూ ఇస్తారు. ఇనుమును లారీలో లోడ్ చేశాక మళ్లీ కాటాకు తీసుకువెళ్లి బరువు చూస్తారు. అప్పుడు మైనస్ అరటన్ను బరువును తీసేసి ఇనుముతో కలుపుకొని మొత్తం మూడు టన్నుల బరువు చూపిస్తారు. వాస్తవానికి లారీలో లోడ్ చేసేది టన్నున్నర ఇనుమే. అంటే.. అర టన్ను ఇనుమును తేలిగ్గా దోపిడీ చేసేస్తారు. ఆ రోజు టన్ను ఇనుము ధర రూ.40వేలు ఉంటే వినియోగదారుడు రూ.20వేలకు మోసపోయినట్టే. ఆనక.. అదనంగా వచ్చిన డబ్బును దళారులు, షాపు యజమాని పంచుకుంటారు. కాటాలో వ్యత్యాసం చూపించినందుకు కాటా నిర్వాహకులకు కిలోకు రూ.3 ఇస్తారు.
అంతులేని ఆగడాలు
ఈనెల మూడో తేదీన పరిటాల గ్రామ సర్పంచి తంగిరాల పద్మావతి ఈ తరహా మోసాన్ని వెలికితీసి షాపు యజమానితో గొడవకు దిగారు. పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. కొందరు ఐరన్ వ్యాపారులు మోసాలు చేస్తున్నా విజయవాడ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్స్ అసోసియేషన్ నిస్సహాయ స్థితిలో ఉండడంపై మిగిలిన వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయపార్టీల లావాదేవీలను చూసే కొందరు న్యాయవాదులు అక్రమార్కులకు బంధువులు కావడంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తూనికలు, కొలతల అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఐరన్ కాంప్లెక్స్‌లోని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతా మాయ
Published Sun, Apr 12 2015 3:19 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement