పోలీసుల అదుపులో నిందితుడు
శంషాబాద్: తుక్కు సామాన్లు విక్రయించిన డబ్బుల పంపకంలో జరిగిన గొడవే కొత్తూరులో చోటు చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి(55) హత్యకు కారణంగా తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, రాయచూర్‌కు చెందిన తెలుగు నాగప్ప ఇరవై రోజుల కిందట కాచిగూడకు వచ్చి అక్కడే నివాసముంటున్నాడు. ఇనుప సామాన్లు, తక్కు ఏరుకుని వాటిని విక్రయించేవాడు. ఈ నెల 23న రాత్రి అతడికి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఇద్దరు కలిసి చేగూరు సమీపంలోని స్క్రాప్ దుకాణంలో తాము సేకరించిన తుక్కును విక్రయించారు. డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. అప్పటికే ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి నాగప్పను కట్టెతో కొట్టడమేగాక డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కొత్తూరు సమీపంలోని మెగాఫ్లోర్ మిల్ వద్ద అతను మరోమారు నాగప్పపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన నాగప్ప అతడి వద్ద ఉన్న కర్ర లాక్కుని చితకబాదాడు. అనంతరం తలపై రాయితో మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆదివారం రాత్రి శంషాబాద్ పాలమాకుల వద్ద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మృతుడి వివరాలు గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment