వికారాబాద్: చాకలిగుట్ట తండాలో గురువారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందుతులైన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం బాక్సర్ జిల్లా బాషీ గ్రామానికి చెందిన తరుణ్ చౌదరి(41) మేకగూడ శివారులోని ఓ గోదాంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. చాకలిగుట్ట తండాలో నివాసం ఉంటున్నాడు.
బీహార్‌కు చెందిన అక్షయ్ బింద్ తన భార్య గుడియా దేవిలు సైతం స్థానికంగా ఓ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఇదే తండాలో ఉంటున్నారు. తరుణ్ చౌదరికి అక్షయ్ బింద్ దూరపు బంధువు కావడంతో తరుణ్ చౌదరి తరచుగా అక్షయ్ ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో తరుణ్ చౌదరికి గుడియా దేవికి అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన అక్షయ్.. తన భార్యను పలుమార్లు మందలించాడు. మరోసారి అలా చేస్తే తరుణ్ చౌదరిని చంపేస్తానని భార్యను హెచ్చరించాడు.
గొంతు నులిమి..
ఈ క్రమంలో మృతుడు తరుణ్ చౌదరి గురువారం రాత్రి మద్యం సీసాలను తీసుకొని అక్షయ్ ఇంటికి వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం తాగిన మైకంలో తరుణ్ చౌదరి గడియా దేవితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని గమనించిన అక్షయ్.. తరుణ్‌పై దాడి చేశాడు. గడియా సైతం భర్తకు సహకరించంతో ఇద్దరు కలిసి పిడిగుద్దులు గుద్ది గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం ఏమి తెలియనట్లు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు.
దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ఆర్‌ఐ రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యప్తు చేపట్టారు. నిందితుల కోసం వెతుకుతుండగా శనివారం ఉదయం నందిగామ చౌరస్తాలో అనుమానాస్పదంగా కనపడటంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారని ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు. దీంతో నిందితులను కోర్టులో హాజరు పరిచి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు అయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment