Measures Department officials
-
‘కిన్లే’ బాటిళ్ల అప్పగింతకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ సీజ్ చేసిన లక్ష మంచినీటి బాటిళ్లను కిన్లే కంపెనీకి అప్పగించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. గత ఏప్రిల్ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు మెదక్ జిల్లా, పాశమైలారంలోని హిమజల్ బేవరేజెస్లో తనిఖీలు నిర్వహించారు. కిన్లే బాటిళ్లపై వినియోగదారులు ఫిర్యాదులు చేయాల్సిన వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లేవంటూ లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. వీటిని వెంటనే తమకు అప్పగించేందుకు ఆదేశించాలని కిన్లే కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సందర్భంగా సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుబట్టారు. ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఉన్నాయని, వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదన్నారు. జప్తు చేసిన బాటిళ్లను కంపెనీకి అప్పగించాలని తూనికలుకొలతల శాఖ, అధికారులను ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ తూనికలుకొలతల శాఖ, హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ చేయగా సోమవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాల్సివుందని, ఈ దశలో బాటిళ్లను అప్పగించేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జప్తును ఎత్తివేయాలన్న కంపెనీ తరఫు న్యాయవాది అభ్యర్థనపై స్పందిస్తూ.. వినియోగదారుడు డబ్బు పెట్టి కొనుగోలు చేసిన మంచినీటి బాటిల్లోని నీరు ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకునే హక్కు వారికి ఉందని, మూసీ నీటినే శుద్ధి చేసి ఇస్తున్నారో, వేరే ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియాలి కదా.. అని వ్యాఖ్యానించింది. వాదనల అనంతరం ధర్మాసనం విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ సీజ్ చేసిన బాటిళ్లను విడుదల చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. -
సినిమా హాళ్లలో పక్కాగా ఎంఆర్పీ అమలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో వస్తువుల ఎంఆర్పీ, పరిమాణం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఆదే శాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే సంస్థలపై కేసులు నమోదు చేసి, అధిక మొత్తం లో జరిమానాలు విధిస్తామ న్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. 23, 24 తేదీల్లో జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్లు మల్టీప్లెక్స్, సినిమాహాళ్ల యజమానులతో సమావేశమవ్వాలని ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానీయాలు, ప్యాకింగ్ చేయని ఇతర ఉత్పత్తులధర, పరిమాణం తెలుపుతూ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విక్రయానికి వినియోగదారులకు బిల్లు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించి స్టిక్కర్ అంటించేందుకు అనుమతించామని, సెప్టెంబర్ 1 నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలన్నారు. అధిక ధరలు వసూ లు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
పెట్రోల్ బంకులపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. పెట్రోల్ బంకుల మోసాలపై కొద్దీకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 70 బంకుల్లో తనిఖీలు చేయగా..నిబంధనలు ఉల్లంఘించిన 15 బంకులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 12 బంకుల్లో డీజిల్ తక్కువగా పోస్తుండటం తోనూ , లైసెన్స్ రెన్యువల్ చేసుకోని మరో 3 బంకులపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ దగ్గర ఉన్న ఐడీపీఎల్ ఫార్చ్యూన్ ఫ్యుయల్ హెచ్పీసీ పెట్రోల్ బంకులో అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇందులో 5 లీటర్ల డీజిల్‌కు 300 ఎంఎల్ తక్కువగా పోస్తున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
సుజనా మాల్లో తనిఖీలు.. 15 కేసులు
సాక్షి, హైదరాబాద్ : నగరం లోని షాపింగ్ మాల్స్‌పై తూనికలు కొలతల శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యక తనిఖీల్లో భాగంగా, తూకంలో మోసాలు, ప్యాకేజ్డ్ కమోడిటీస్ నియమాల ఉల్లంఘనలపై కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో కంట్రోలర్ అకున్ సబర్వాల్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ తనిఖీలు నిర్వహించారు. గురువారం ఒక్కరోజే జరిపిన దాడుల్లో ఏకంగా 102 కేసులు నమోదు చేశారు. దాదాపు 23లక్షల రూపాయల విలువైన వస్తువులను అధికారులు సీజ్ చేశారు. ఇనార్బిట్ మాల్లో 30 కేసులు నమోదు, 3.5 లక్షల రూపాయల జరిమానా జీవీకే మాల్లో 17 కేసులు, 3.4 లక్షల రూపాయల జరిమానా ఫోరం సజనామాల్ లో 15 కేసులు, రూ.90 వేల జరిమానా విధించారు -
ఆన్లైన్ మోసాలకు కళ్లెం
♦ నగరానికి చెందిన రాజేష్‌కు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉంది. ఖరీదైన మొబైల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చినకవర్‌ను తెరిచి చూసి షాక్ అయ్యాడు. తాను బుక్ చేసినది కాకుండా మరొకటి రావడంతో ఖంగుతిన్నాడు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆందోళన చెందాడు. ఆన్లైన్లో చూస్తే ఎలాంటి వివరాలు లేవు. ♦ పీలేరుకు చెందిన రాణి ఆన్లైన్లో ఓ ఖరీదైన చీరను కొనుగోలు చేసింది. పార్సిల్లో నాసిరకం చీర వచ్చింది. దీన్ని చూసిన ఆమె ఎవరికి చెప్పుకోలేక మథనపడుతోంది. తిరుపతి క్రైం :జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాం తంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నగదు రహి త లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్క రూ ఆన్లైన్ వ్యాపారంపై మొగ్గు చూపుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇలాంటి మోసాలకు కళ్లెం వేసేందుకు తూనికలు, కొలతలు శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ– కామర్స్ వైపు దృష్టి పెట్టేలా ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. దాంతో ఆన్లైన్లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతల ను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను అమలుకు ఆ శాఖ అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఈ మార్కెట్‌పై నిఘా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ– మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్రం కొన్ని చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను తూనికల కొలతల శాఖకు అప్పగించింది. జీఎస్ఆర్ 629 ఉత్తర్వు ల మేరకు ఈ తరహా మోసాలకు అడ్డుకట్టు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంద్రించాల్సిన చిరునామా, కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొనుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొనడంతో ఈ దశగా మార్పులు ప్రారంభమయ్యాయి. ఇది పరిస్థితి జిల్లాలో 70 నుంచి 80 శాతం మంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నా రు. వీరిలో 40 శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్ఫోన్లు, కొత్తకొత్త మోడళ్ల కోసం నిత్యం సర్చ్ చేస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ వంటి మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నాయి. వాటి జోలికి వస్తే నట్టేట ముంచేస్తున్నారు. ఫిర్యాదు ఇలా ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. డివిజన్ల వారీగా ఇన్స్పెక్టర్లకు లేదా సంబంధిత అధికారులను కలిసి తాము మోసపోయిన విధానాన్ని వివరించవచ్చు. ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో కొనుగోలు చేసిన రసీదు, సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు చూపించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో ఆన్లైన్లో చూపించిన వస్తువు, ఇంటికొచ్చిన పార్సల్లోని వస్తువును చూపించాలి. అలా వివరించిన అనంతరం మోసానికి పాల్పడిన సంస్థకు తూనికల శాఖ నోటీసు జారీ చేస్తుంది. అనంతరం వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. మోసానికి పాల్పడితే చర్యలే.. ఈ–కామర్స్ సంస్థలో వినియోగదారులు మోసపోకుండా భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటిలో జరిగే లావాదేవీలపై తూనికలశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆన్లైన్ కంపెనీలు ఎటువంటి మోసాలకు పాల్పడినా వెంటనే ఫిర్యాదు చేయండి. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో వస్తువులు మారినా, నాణ్యత తగ్గినా వస్తువు వివరాలు లేకపోయినా చర్యలు తప్పవు.– రవీంద్రారెడ్డి, తూనికలు,కొలతలశాఖాధికారి, తిరుపతి -
తూనికలు, కొలతల శాఖ దాడులు
- ఒంగోలు బాస్టాండ్‌లోని ఆరుషాపులపై కేసులు నమోదు - ఆర్టీసీ ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామన్న ఒంగోలు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఒంగోలు: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్న పలువురు వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముందుగా వినియోగదారుల మాదిరిగా పలు షాపుల్లో శీతల పానీయాలు కొనుగోలుచేసేందుకు వెళ్లారు. అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేశారు. షాపు నెంబర్లు 5,11,13,22,41 లతో పాటు ఆర్టీసీ బస్టాండు ఆవరణలోనే ఉన్న నియోస్ ఫుడ్ కోర్టుపై కూడా కేసులు నమోదుచేసినట్లు తూనికలు కొలతల శాఖ ఒంగోలు ఇన్ స్పెక్టర్ కేవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. షాపు నెంబర్ 11లో అయితే శీతలపానీయాల అన్ని బాటిల్స్‌పై ఎంఆర్పీ ధరలు కనపడకుండా చేశారని తెలిపారు. వినియోగదారులు ప్రశ్నించకుండా ఉండేందుకు చేసిన మోసపూరితమైన చర్యగా భావిస్తున్నామన్నారు. వీరందరిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు పంపనున్నామన్నారు. ఒక్కో బాటిల్‌కు రూ. 5 నుంచి 15 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రుజువైందన్నారు. సాంకేతిక నిపుణులు ఆలీబేగ్, అనీల్, సిబ్బంది సుబ్రహ్మణ్యం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా మాయ
♦ ఉక్కు కొంటే బుక్కయినట్టే.. ♦ భవానీపురం ఐరన్ యార్డులో మాయామశ్చీంద్రుల హల్చల్ ♦ దళారుల ఉచ్చులో పడితే జేబుకు చిల్లే.. ♦ తూకంలో భారీ మోసాలు : వినియోగదారులకు కుచ్చుటోపీ ♦ ముడుపుల మత్తులో తూనికలు, కొలతల శాఖ అధికారులు భవానీపురం : రాష్ట్రంలోనే అతిపెద్దదిగా పేరొందిన భవానీపురం ఐరన్ యార్డులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఐరన్ వ్యాపారుల్లోని కొందరు మాయామశ్చీంద్రలు బరితెగించి వ్యాపారం సాగిస్తున్నారు. ఇనుము కొనేందుకు వచ్చిన వారిని తక్కువ తూకంతో బురిడీ కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన సూత్రధారి సుమారు 30మంది యువకులకు లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి, ద్విచక్ర వాహనాలను ఏర్పాటుచేసి తన షాపుల తరఫున దళారులుగా నియమించుకోవడం విశేషం. వీరంతా ఐదు బృందాలుగా విడిపోయి వారికి అనుకూల షాపుల్లో ఏదో ఒక దానికి ఐరన్ కొనిచ్చి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. ఈ దళారుల బృందం పుణ్యమా అంటూ అనతికాలంలోనే వ్యాపారంలో విజృంభించిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలతో ‘నరసింహా’వతారం ఎత్తాడు. ఎలా మోసం చేస్తారంటే... ఇనుము కొనేందుకు వచ్చే వారిని యార్డులోకి వెళ్లకుండా బైపాస్ రోడ్డులోనే ఈ బృందంలోని కొందరు చుట్టుముడతారు. ఉదాహరణకు ఆ రోజు టన్ను ఇనుము ధర రూ.40వేలు ఉంటే వీరు నాలుగైదు వేలు తక్కువ చెబుతారు. వినియోగదారుడికి నమ్మకం కలిగాక కొంచెం ముందుకు వెళితే, అక్కడా అతనిని చుట్టేస్తారు. మొత్తంమ్మీద ఈ బృందంలోని వారంతా కలిసి ఇతర షాపుల్లోకి వెళ్లకుండా వారిని పోషించే షాపునకు వినియోగదారులను మళ్లిస్తుంటారు. కాటాలో బురిడీ కొనుగోలు చేసిన ఇనుమును తరలించేందుకు అవసరమైన ఖాళీ లారీని కాటా దగ్గరకు తీసుకువెళతారు. లారీ టన్ను బరువు ఉందనుకుంటే దళారుల సూచనల మేరకు అరటన్ను మైనస్ చూపిస్తారు. ఆ మేరకు కాటా నిర్వాహకులు బిల్లూ ఇస్తారు. ఇనుమును లారీలో లోడ్ చేశాక మళ్లీ కాటాకు తీసుకువెళ్లి బరువు చూస్తారు. అప్పుడు మైనస్ అరటన్ను బరువును తీసేసి ఇనుముతో కలుపుకొని మొత్తం మూడు టన్నుల బరువు చూపిస్తారు. వాస్తవానికి లారీలో లోడ్ చేసేది టన్నున్నర ఇనుమే. అంటే.. అర టన్ను ఇనుమును తేలిగ్గా దోపిడీ చేసేస్తారు. ఆ రోజు టన్ను ఇనుము ధర రూ.40వేలు ఉంటే వినియోగదారుడు రూ.20వేలకు మోసపోయినట్టే. ఆనక.. అదనంగా వచ్చిన డబ్బును దళారులు, షాపు యజమాని పంచుకుంటారు. కాటాలో వ్యత్యాసం చూపించినందుకు కాటా నిర్వాహకులకు కిలోకు రూ.3 ఇస్తారు. అంతులేని ఆగడాలు ఈనెల మూడో తేదీన పరిటాల గ్రామ సర్పంచి తంగిరాల పద్మావతి ఈ తరహా మోసాన్ని వెలికితీసి షాపు యజమానితో గొడవకు దిగారు. పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. కొందరు ఐరన్ వ్యాపారులు మోసాలు చేస్తున్నా విజయవాడ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్స్ అసోసియేషన్ నిస్సహాయ స్థితిలో ఉండడంపై మిగిలిన వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయపార్టీల లావాదేవీలను చూసే కొందరు న్యాయవాదులు అక్రమార్కులకు బంధువులు కావడంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తూనికలు, కొలతల అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఐరన్ కాంప్లెక్స్‌లోని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.