కోటబొమ్మాళి: సాక్షాత్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంతమండలమైన కోటబొమ్మాళిలోని తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి చీడపురుగులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవా కేంద్రంలో పలు ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ కార్యాలయంలో సిబ్బంది అక్రమాలకు అడ్డులేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఇద్దరు వీఆర్వోలే ప్రధాన సూత్రధారులుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ బాలాజీ శ్రీనివాస్ ఉదంతం ఈ కార్యాలయం అవినీతికి నిదర్శనం. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు, అడంగళ్లు, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, జనన మరణ ధ్రువపత్రాలు తదితర వాటికి సంబంధించి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడుకు బంధువులమని చెప్పుకుంటూ ఇద్దరు వీఆర్వోలు ఇలా లంచాలు దండుకుంటున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.
పాస్‌పుస్తకానికి రూ.3 వేలు, అడంగళ్లల్లో తప్పులు సరిదిద్దడానికి, వెబ్ ల్యాండ్‌లో నమోదుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు, జనన ధ్రువపత్రానికి రూ.రెండు వేలచొప్పున వసూలు చేస్తున్నారని, ముడుపులు చెల్లించేందుకు నిరాకరించిన వారికి చుక్కలు చూపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ కార్యాలయం బాగోతం వెళ్లినప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం ఉంటుందేమోనన్న భయంతో సిబ్బంది అవినీతికి కళ్లెం వేయలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా బహిరంగ సభల్లో అవినీతి అక్రమాలపై మాట్లాడే మంత్రి అచ్చెన్నాయుడు తన ఇలాకాలోనే ఇంత అవినీతి జరుగుతుండడంపై సర్వత్రీ తీవ్రవిమర్శలు వినిపిస్తున్నాయి.
అవినీతిపై ఫిర్యాదులు అందలేదు
ఈ ఆరోపణలపై స్థానిక తహశీల్దార్ వై.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా సాంకేతిక పరమైన ఇబ్బందులు వల్ల కొన్ని ధ్రువపత్రాల జారీలో జాప్యం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తమ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఇప్పటి వరకు తనకు ఫిర్యాదులు రాలేదని చెప్పారు.
అచ్చెన్న ఇలాకాలో అవినీతి చీడ!
Published Sun, Jun 7 2015 11:41 PM | Last Updated on Mon, Jul 29 2019 5:25 PM
Advertisement
Advertisement