కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం
విజయనగరం, కురుపాం: ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి అన్న చందగా తెలుగు తమ్ముళ్లు పాలన సాగిస్తున్నారు. దీనికి కురుపాం మండలంలోని పలు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల సొమ్ము వసూళ్లు చేయడమే నిలువెత్తు నిదర్శనం. దీనికి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వత్తాసు పలకడంతో వసూళ్లు సాఫీగా సాగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కురుపాం మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎస్‌ఎన్‌సీయూ(నవజాత శిశు సంరక్షణ కేంద్రం)లో హెల్పర్లు, అటెండర్లు, నైట్‌వాచ్‌మేన్‌లు నియామకానికి సంబంధిత ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో కీలక వ్యక్తి రూ.లక్షల్లో వసూళ్లు చేసి తమకు సంబందించిన వర్గీయులకే ఉద్యోగాల్లో నియమించినట్లు తెలిసింది.
సొమ్ము చేసుకున్న తమ్ముళ్లు...
ఆదర్శ పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో కమాటీ, కుక్, నైట్‌వాచ్‌మేన్, హెల్పర్స్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉండడాన్ని గమనించిన తెలుగు తమ్ముళ్లు, ఓ మాజీ ఎంపీపీతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు రూ.లక్షలు వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది. ఓ సీనియర్ టీడీపీ కార్యకర్త నుంచే రూ.లక్షల్లో డబ్బులను వసూళ్లు చేశారు. ఒక ఉద్యోగమే మంజూరు కావడంతో పొరపొచ్చాలు రావడం, సదరు వ్యక్తులు బహిరంగంగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదర్శ పాఠశాలల్లో అవసరం లేకున్నా ప్రత్యేకించి ఏఎన్‌ఎం ఉద్యోగాలు ఉండాలని ఓ కొత్త జీఓను సృష్టించి ఆయా ఉద్యోగాల్లో తెలుగు తమ్ముళ్లే తమకు సంబంధించిన వర్గీయులకు నియమించుకునేలా గప్‌చుప్‌గా వ్యవహారం నడిపి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటిండెంట్ వారణాసి గౌరీశంకరరావు వద్ద ప్రస్తావించగా ఉద్యోగ నియామకాల విషయమై తాము ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సూచనల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కొంతమందిని నియమించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment