యర్రగొండపాలెం: రాష్ట్రంలో అవినీతి ఎంత ఉందో అంతకు మించి నియోజకవర్గంలో అవినీతి తాండవమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక రాజీవ్ అతిథి గృహం ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ఏలుతోందని, అధికార టీడీపీకి చెందిన నాయకులు ఏమీ మిగల్చడం లేదని, వారు మరుగుదొడ్లను సైతం వదలడం లేదని, జన్మభూమి కమిటీల పేరుతో ఈ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో టీడీపీ పాలన అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాము ఎంతో అభివృద్ధి సాధించామని ప్రగల్బాలు పలుకుతూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లామని, వందల కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఎనలేని అభివృద్ధి సాధించామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు నిధులు మంజూరు కాకపోయిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకుంటూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.
సీఎం కంటే రెండాకులు ఎక్కువే:
నియోజకవర్గ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సీఎం కంటే రెండాకులు ఎక్కువగా చదివారని, 11వ పర్యాయం జిల్లాకు వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు 2019 మే నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు అందిస్తామని ప్రకటిస్తే, ఎమ్మెల్యే మాత్రం 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అనడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. సీఎం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుంటే, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో వారికి విశ్వసనీయత లేకుండా పోయిందని, ఒక పార్టీపై గెలిచి డబ్బుల సంచుల కోసం మరో పార్టీలోకి వెళ్లిన వారికి విశ్వసనీయత ఎక్కడ నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు.
నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రూ.35 కోట్లతో సీసీ రోడ్లు అభివృద్ధి పరిచామంటున్నారని ఎక్కడ అభివృద్ధి పరిచారో చూపించాలని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, 12వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులతో నాసిరకం రోడ్లు వేసి డబ్బులు దోచుకున్నారని ఆయన అన్నారు. పెద్దదోర్నాలలో బస్టాండ్ నిర్మాణం, పెద్దారవీడు మండలంలో కేంద్రీయ విద్యాలయం, 11 గ్రామాలకు సాగర్ నీటి పథకం, యర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కళాశాల తదితర అభివృద్ధి పనులు తామే తీసుకొని వచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
పెద్దదోర్నాల బస్టాండ్ కోసం స్థలసేకరణకు రూ.7.70 లక్షలు తన సొంత నిధులను రోడ్లు, భవనాల శాఖకు చెల్లించి ఆ స్థలాన్ని ఆర్టీసీకి అప్పచెప్పారని, కేంద్రీయ విద్యాలయం ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అవిరళ కృషి చేసి పెద్దారవీడు మండలంలో ఏర్పాటు చేయించారని, సాగర్ నీటి పథకం, మోడల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు జరిగినప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైనది ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఎవరు ఏ మేరకు అభివృద్ధి చేశారో బహిరంగంగా చర్చించుకోవటానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
లేని డిగ్రీతో రాళ్లపై ఎక్కుతున్నారు:
తనకు లేని డిగ్రీతో ఎమ్మెల్యే డేవిడ్‌రాజు శిలాఫలకాలపై పేరుముందు డాక్టర్ అని చెక్కించుకుంటున్నారని ఆయన అన్నారు. ఆయనకు డాక్టరేట్ ఇచ్చిన సంస్థ ఒక బోగస్ సంస్థ అని, అది ఎక్కడుందో ఆయనకు కూడా తెలియదని, రూ.2 లక్షలు ఇచ్చి పీహెచ్‌డీ డిగ్రీ తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశామని, దీనిపై విచారణ జరిపించాలని తాము కోరామని ఆయన అన్నారు.
ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల అధ్యక్షులు దొంతా కిరణ్‌గౌడ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్.జబీవుల్లా, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మూడమంచు బాలగురవయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, నవోదయ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కందూరి గురుప్రసాద్, నాయకులు బి.వి.సుబ్బారెడ్డి, అరుణాబాయి, రోషిరెడ్డి, దండా శ్రీనివాసరెడ్డి, బాలచెన్నయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment