క్వారీ డస్ట్ రోడ్డు ఇలా.. (రావ్ అండ్ నాయుడు కాలేజీ– చెరువుకొమ్ముపాలెం రోడ్డు)
ఒంగోలు అర్బన్: నగరపాలక పరిధిలో రోడ్లు, డ్రైన్లు, పైపులైన్ల పనుల్లో నగరపాలక ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యతకు పాతరేస్తున్నారు. పర్సంటేజీలు ఉంటే చాలు నాణ్యతతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పనులను పరిశీలించాల్సిన అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఎవరూ ఆ వైపు కూడా కన్నెత్తి చూడకూడదని డీఈ స్థాయి అధికారి హూకుం జారీ చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు డబ్బు మిగుల్చుకునేందుకు నాసిరకం పనులు చేసి బిల్లులు పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. òరావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ ఎదురు బైపాస్ రోడ్డు నుండి చెరువుకొమ్ముపాలెం వరకు రూ.40 లక్షల వ్యయంతో క్వారీ డస్ట్‌తో రోడ్డు పని చేసినా ఆ రోడ్డు గుంతలమయంగా ఉంది. దీంతో ఆ రోడ్డులో వాహనదారులు ప్రయాణించాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
రోడ్డు వేసినప్పుడే గుంతలమయంగా ఉంటే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇంకా దారుణంగా ఉండి రాకపోకలకు పూర్తిగా పనికిరాకుండా పోతోందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రోడ్డు వెడల్పు కూడా ఒకచోట ఒకలా మరోచోట ఒకలా ఉంటూ వెడల్పులో ఎక్కువ తక్కువలున్నాయి. ఆ రోడ్డు పక్కన చైన్‌మౌంటెడ్ మిషన్లతో గంటకు రూ.1300 కేటాయించి కచ్చాకాలువ తీయడం, ఉన్న కాలువలో చెత్తను తొలగించడం వంటి పనులు ఎస్టిమేట్‌లో ఉన్నా అవి జరిగిన దాఖాలాలు లేవు. కానీ సదరు రోడ్డుకు సంబంధించి బిల్లులు కూడా పెట్టుకున్నట్లు విశ్వనీయ సమాచారం. అయితే మున్సిపల్ ఇంజినీర్ సదరు రోడ్డు పని ఇంకా పూర్తి కాలేదని చెప్పడం గమనార్హం. వెంగముక్కపాలెం వద్ద సుమారు రూ.40 లక్షలతో చేపట్టిన మంచినీటి పైపులైను పనులకు పర్యవేక్షణ కరువైంది. దీంతో పైపులైన్ పనులు ఇష్టానుసారంగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
పైపుల కింద నింబంధన ప్రకారం వేయాల్సిన ఇసుక, కంకర వంటివి సక్రమంగా లేకుండా పనులు జరుగుతున్నట్లు విమర్శలున్నాయి. ఈ పనులే కాకుండా సదరు డీఈ స్థాయి ఇంజినీర్ పరిధిలో ఏ పనులు జరిగినా, జరుగుతున్నా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనులు పరిశీలించాల్సిన అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లను పక్కన పెట్టి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కేవలం మాముళ్ల మత్తులో జోగుతున్నాడని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నగరపాలక ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రజాధనంతో చేసే సివిల్ పనులు నాణ్యతతో చేసి పదికాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.
ట్రంకు రోడ్డులోనూ అంతే..
రిమ్స్ నుండి ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వరకు ట్రంకురోడ్డులో నిర్మిస్తున్న పైపులైను పనుల్లోనూ నాణ్యత లేదని నగరవాసులంటున్నారు. ఇతను ఒక్కడే కాకుండా తమ్ముడు వరసయ్యే ఏఈ స్థాయి వ్యక్తికి కూడా నగరపాలక పరిధిలో మొక్కలు సరఫరా చేసే బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నగరపాలక సంస్థకు చెందిన మొక్కల సరఫరాలో నాసిరకం మొక్కలతో పాటు లెక్కల్లో అవకతవకలున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నగరపాలక సంస్థ చేపడుతున్న సివిల్ పనుల్లోని అవకతవకలు, అవినీతిపై విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ దృష్టి సారిస్తే మరికొన్ని అక్రమాలు బయటకొస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment