గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లలో ఒకటి
గుంటూరు, వడ్లమూడివారిపాలెం(రొంపిచర్ల): ఇప్పటివరకు మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య లోలోన రగులుతున్న విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రచ్చకెక్కి కుమ్ములాటలకు దారితీస్తున్నాయి. మండలంలోని వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతి మంగళవారం గుప్పుమంది. ఈ గ్రామంలో నాలుగున్నరేళ్లలో 400 మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. నిర్మించిన మరుగుదొడ్లన్నింటికీ నిధులు విడుదలైనప్పటికీ, ఆ మొత్తం లబ్ధిదారులకు ఇప్పటివరకు నగదు చేరలేదు. దీంతో కొందరు టీడీపీ నాయకులే మరుగుదొడ్లు ఎవరెవరికి వచ్చాయి, నిధులు ఎంతవరకు విడుదలయ్యాయనే సమాచారాన్ని సేకరించారు.
గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వెనుకబడిన వర్గాల వారు పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం తమకు మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు రాలేదని గ్రామంలోని ఒక నాయకుడిని సంప్రదించారు. ఆ నాయకుడు దీనిపై ఆరాలు తీస్తుండగా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్న వారు ఆ నాయకుడితో వాదనకు దిగటంతో పాటు దాడికి కూడా పాల్పడ్డారు. ఇప్పటివరకు 400 మరుగుదొడ్లు నిర్మించగా, అందులో 150 మందికి మాత్రమే నిధులు చేరాయి. మిగతా 250 మందికి మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు అందలేదు. అయితే కొంతమంది రూ.2వేలు ఇచ్చారని, రూ.3వేలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంమీద వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో రూ.30 లక్షల వరకు నిధులు గోల్‌మాల్ అయినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో చోటుచేసుకున్న ఉద్రిక్త వాతావరణం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. మరుగుదొడ్ల నిధులు అందని లబ్ధిదారులకు త్వరలో ఆ నిధులు అందేటట్టు చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన మీదట కేసు నమోదుకాకుండా ఇరువర్గాల వారు రాజీపడినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment