చేవెళ్ల, న్యూస్‌లైన్: మద్దతు ధరను ప్రభుత్వం అరకొరగా పెంచుతుండటం, దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తూ ఆశ చూపుతుండటం.. వెరసి మార్కెట్ మాయాజాలంలో చిక్కి పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో ధర స్థిరంగా ఉంటుందన్న విషయం గ్రహించిన వ్యాపారులు రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చే సమయంలో మద్దతు ధర కంటే ఓ వందో.. రెండు వందల రూపాయలో ధర పెంచి రైతులకు ఆశ చూపించి పత్తి ఎగరేసుకుపోయారు.
సీసీఐ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు, అలాగే వ్యాపారులు స్వల్పంగా పెంచిన ధరకు జిల్లావాప్తంగా పలువురు రైతులు పత్తి పంట అమ్ముకున్నారు. ఈ ధరలకు పత్తి పంటను అమ్ముకున్న దాదాపు 70శాతం మంది రైతులు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర పెరగడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక అల్లాడిన రైతన్నకు అంతా అయిపోయాక ధర పెరగడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.
ఒక్కసారిగా క్వింటాలుకు సుమారు రూ.వెయ్యికి పైగా ధర పెరగడంతో ఇప్పటికే పత్తిని అమ్ముకున్న రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు సీసీఐ కొనుగోలు కేంద్రాలను మూసివేయడంతో పలు గ్రామాల్లో రైతుల ఇళ్లలో పత్తి ఇంకా నిల్వ ఉంది. ఈ పత్తిని మొత్తం కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన వ్యాపారులు ఏకంగా గ్రామాల్లోకే వెళ్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే సుమారు రూ.800ఎక్కువ చెల్లిస్తూ పత్తి కొనుగోలు చేసి జిన్నింగ్ మిల్లులకు తరలిస్తున్నారు. చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌లో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాల్లో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. గత ఖరీఫ్ సీ జన్‌లో డివిజన్‌వ్యాప్తంగా 14,340 హెక్టార్లలో పత్తి పంట సాగయ్యింది. పంట కొనుగోలుకు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించింది.
‘మద్దతు’ తక్కువ.. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువ
ప్రభుత్వం పత్తిపంటకు నిర్ణయించిన మద్దతు ధర గతంతో పోలిస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో పలువురు రైతులు సీసీఐకి పంట అమ్ముకోవడానికి ఉత్సాహం చూపలేదు. పత్తి పంటకు 2012 సంవత్సరంలో క్వింటాలుకు రూ.3900 ఉన్న మద్దతు ధరను ప్రభుత్వం 2013లో మరో వంద రూపాయలు పెంచి రూ.4వేలుగా ఖరారు చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ ధరే చెల్లించారు.
అయితే సీజన్ ప్రారంభంలోనే వ్యాపారులు పత్తిని క్వింటాలుకు రూ.4200-4300కి కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి రైతులు ఆసక్తి చూపలేదు. 2012లో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూకట్టిన రైతులు ధర వ్యత్యాసంతో ఈసారి వాటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం వ్యాపారులు పత్తి పంట క్వింటాలుకు రూ.5వేలు చెల్లించి కొనుగోలు చేసినా సీసీఐ మాత్రం రూ.4వేలకు ఒక్కపైసా పెంచలేదు. ప్రస్తుతం వ్యాపారులు పత్తి ధరను కొద్దిగా తగ్గించి క్వింటాలు రూ.4,800కి కొనుగోలు చేస్తున్నారు.
మార్కెట్ మాయ!
Published Mon, Jan 27 2014 11:14 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement