రీచ్ కాలేదు! | Could not Reach! | Sakshi
Sakshi News home page

రీచ్ కాలేదు!

Published Wed, Nov 19 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

రీచ్ కాలేదు!

రీచ్ కాలేదు!

సాక్షి, కర్నూలు : ఇసుక బ్లాక్ మార్కెట్ విక్రయాల నుంచి నిర్మాణదారులకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఆదిలో కష్టాలను తెచ్చిపెడుతోంది. గతంలో ఇసుక మాఫియా వెనకున్న పెద్దలు, చిన్నపాటి దళారులు ఇప్పుడు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటుండడంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అధికారులకు అవగాహన కలిగి, ఈ విధానంలో ఇసుక విక్రయాలను గాడిలో పెట్టేలోపే కొత్త దళారులు పుట్టుకొస్తున్నారు.

అందినకాడికి దోచుకోవడానికి కొత్త అవతారాలెత్తుతున్నారు. ఫలితంగా కారుచౌకగా వినియోగదారునికి చేరుతుందనుకున్న ఇసుక ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ ఆశయం ఆచరణలో నిర్మాణదారులకు ‘రీచ్’ కాకపోవడంతో ప్రయోజనం కన్పించడంలేదు.

 అక్రమార్కులు నల్లబజారులో అమ్మకాలు జరిపినప్పుడున్న ధరకంటే ఇప్పటి ధర మూడు రెట్లు అధికంగా ఉంటోంది. అటు డ్వాక్రా సంఘాల పర్యవేక్షణలో నడుస్తున్న రీచ్‌ల్లోనూ కష్టాలు తప్పడం లేదు. రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు కూలీలు ముందుకురావడం లేదు. ఇతరులను ఆ పనికి రానివ్వడం లేదు. ధర గిట్టుబాటు కావడం లేదని పేర్కొంటున్నారు.

ఫలితంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించిన నిడ్జూరు-బావాపురం రీచ్‌లో ఇసుక తవ్వకాలు ఆగిపోవడంతో విక్రయాలు నిలిచిపోయాయి. అలాగే ఈ ఇసుకను తరలించడానికి వినియోగించే లారీలు, ట్రాక్టర్ల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మీ-సేవా కేంద్రాల్లో రిజిస్టర్ అయ్యే ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదు. ఇక్కడా ఒక స్పష్టమైన విధానం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీనికితోడు నిన్నటి వరకు దొంగ రవాణాపై కొరడా ఝళిపించిన మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, రవాణా, పోలీసు శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో మళ్లీ ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. కొత్త విధానం బాలారిష్టాలతో చివరికి నిర్మాణదారునికి కష్టాలు మాత్రం రెట్టింపవుతున్నాయి. ఇసుక ఒక్కదానికే భారీ ధర చెల్లించలేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేస్తున్నారు. కొత్త విధానం వినియోగదారునికి మేలుచేసేదే అయినా ఈ చిన్నపాటి ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో అదికాస్త గుదిబండలా మారుతోంది.

 కొరత సృష్టించి.. కోట్లు గడిస్తున్నారు..
 జిల్లాలో ఒకటి, రెండు, మూడు రీచ్‌లలో తవ్వకాలు పరిమితమవడంతో ఇసుకకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇసుక మాఫియా కన్ను దీనిపై పడింది. ప్రస్తుతం కృత్రిమ కొరత తీసుకొచ్చి భారీగా దండుకుంటున్నారు. జిల్లాలో డ్వాక్రా మహిళలు నిర్వహించే మంత్రాలయం, నిడ్జూరు-బావాపురం, జి.సింగవరం-ఎదూరు రీచ్‌లు నడుస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కడా పూర్తిస్థాయిలో ఇసుక విక్రయాలు జరగకపోవడంతో అవసరాలకు తగినంత ఇసుక అందని పరిస్థితి.

ఇదే అదనుగా ఇసుక మాఫియా, దళారులు ఇసుక కొరత ఆసరా చేసుకుని అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. అధికారపార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు నేతలు కలిసి కర్నూలు శివార్లలోని పంచలింగాల నుంచి రోజూ వందల లారీల్లో ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లను అప్పగించినా.. వారి అక్రమ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు మాత్రమే చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు చెలరేగిపోతున్నారు.

 కొత్త దళారుల ఇష్టారాజ్యం..
 ‘ఇసుక కొనుగోలు చేయాలంటే వినియోగదారులు వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి దగ్గరే ఉండి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే మీ ఇంటికే వస్తుంది’... ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ. దీనికి తగ్గట్టుగానే మహిళలను దీనిలో భాగస్వాములను చేసి, అక్రమార్కుల ప్రాధాన్యాన్ని తగ్గించాలనే దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే డ్వాక్రా మహిళల మాటున దళారులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు రీచ్‌లలో ఇద్దరు నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

 ప్రభుత్వం దృష్టిపెడితేనే..
 ప్రభుత్వం చెబుతున్న ప్రకారం డ్వాక్రా సంఘాల పరిధిలో నడిచే రీచ్‌ల నుంచి ఇసుకను నిర్మాణదారుని ఇంటికి చేర్చగలిగితే నల్ల బజారు విక్రయాలు నియంత్రణ చేసినట్టే. అయితే రవాణాకు అవసరమైన లారీలు, ట్రాక్టర్లు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొంత ఇబ్బందులు తప్పటం లేదు. మరిన్ని రీచ్‌లకు అనుమతులిస్తే తప్ప సామాన్యుడికి అందుబాటు ధరలో ఇసుక లభించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement